Asianet News TeluguAsianet News Telugu

టెలికం రికార్డు: టాప్ లేపిన జియో...120 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

దేశీయంగా టెలికం సబ్ స్క్రైబర్ల సంఖ్య వరుసగా మూడోసారి 120 కోట్లు దాటిందని ట్రాయ్ తెలిపింది. ప్రథమ స్థానంలో రిలయన్స్ జియో కొనసాగుతుండగా, ఎయిర్ టెల్ తిరిగి పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులేస్తున్నదని ట్రాయ్ నివేదిక సారాంశం.

Telecom subscriber base crosses 120 cr; Jio, BSNL, Airtel add customers
Author
Mumbai, First Published Mar 21, 2019, 1:46 PM IST

న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్క్రైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7 కోట్లు కాగా, ఈ జనవరిలో 0.49 శాతం వృద్ధితో 120.3 కోట్లకు చేరుకున్నది. 

రిలయన్స్‌ జియో ఈ కాలంలో కొత్తగా 93 లక్షల నూతన కస్టమర్లను జతచేసుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 9.82 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్‌ లక్ష కొత్త యూజర్లను సొంతం చేసుకున్నాయి. ఇక వొడాఫోన్‌ ఐడియా 35.8 లక్షల కస్టమర్లను కోల్పోయింది. టాటా టెలీ సర్వీసెస్‌ 8.4 లక్షల యూజర్లను కోల్పోయింది. మరోవైపు దేశీయ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 4.15 శాతం వృద్ధితో 54 కోట్లకు చేరుకున్నాయి. 

క్రమంగా భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్యను పెంచుకునే బాటలో పడింది. కొత్తగా లక్ష మందికి పైగా ఖాతా దారులను జత చేసుకున్నది. గతంతో పోలిస్తే టెలికం సబ్ స్క్రైబర్ల సంఖ్య నికరంగా జనవరిలో 59 లక్షలకు పెరిగింది. ఇది మూడు టెలికం ప్రొవైడర్లలో అత్యధికం. వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ సంయుక్తంగా 44 లక్షల ఖాతాదారులను కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా 35.8 లక్షల మంది, టాటా టెలీ సర్వీసెస్ 8.4 లక్షల కస్టమర్లను కోల్పోయాయి. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎంటీఎన్ఎల్’ 4,927 మొబైల్ కస్టమర్లను, బీఎస్ఎన్ఎల్ లాండ్ లైన్ కస్టమర్లు 90 వేల మందిని కోల్పోయింది. దేశ వ్యాప్తంగా బ్రాడ్ బాండ్ కనెక్షన్లు 4.15 శాతం పెరిగి 51.8 కోట్ల నుంచి 54 కోట్లకు చేరాయి. బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్లలో 98.63 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో రిలయన్స్ జియో 28.94 కోట్ల మందితో ముందు వరుసలో నిలువగా, భారతీ ఎయిర్ టెల్ 11 కోట్ల కనెక్షన్లు కలిగి ఉంది. వొడాఫోన్ ఐడియా 10.98 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రెండు కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ 22.6 లక్షల కనెక్షన్లు కలిగి ఉన్నాయి. 

వైర్ లెస్ బ్రాండ్ బాండ్ కనెక్షన్లలో బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా 91.7 లక్షల కనెక్షన్లు కలిగి ఉండగా, ఎయిర్ టెల్ 23 లక్షల కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ఆట్రియా కన్వర్జెన్స్ 7.9 లక్షల కనెక్షన్లు, హాత్ వే సంస్థ 7.9 లక్షల కనెక్షన్లు, ఎంటీఎన్ఎల్ 7.7 లక్షల కనెక్షన్లు కలిగి ఉన్నాయని ట్రాయ్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios