న్యూఢిల్లీ: స్టార్టప్‌లు, ఈ-కామర్స్‌ కంపెనీలు క్యాంపస్‌ నియామకాల బాట పడుతున్నాయి. తమ అవసరాలకు తగిన వారి నియామకం కోసం  ఈ కంపెనీలు దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లను సంప్రదిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లతో మేనేజిరియల్‌ నైపుణ్యాలు కల వారిని నియమించుకుంటున్నాయి. 

కాకుంటే మహిళా టెక్కీలకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. బెంగళూరు, కోల్‌కతా, కోజికోడ్‌లలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో నియామకాలకు సంబంధించి స్టార్టప్‌లు, ఈ-కామర్స్‌ కంపెనీల ఆఫర్లు బాగా పెరిగినట్టు తెలుస్తోంది. 

ఇంజనీరింగ్‌ పూర్తి చేసి మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసిస్తున్న వారికి ఈ కంపెనీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతేకాక గత ఏడాదికన్నా ఈ ఏడాదిలో ఎక్కువ వేతనాలను ఆఫర్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుత సీజన్‌లో కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న వార్షిక వేతన ప్యాకేజీ రూ.14 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. 

అగ్రస్థాయి బిజినెస్‌ స్కూళ్లలో ప్రస్తుత ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో స్టార్టప్‌లు, ఈ-కామర్స్‌ కంపెనీల ఉద్యోగ ఆఫర్లు 50-100 శాతం పెరగడం విశేషం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఓయో రూమ్స్‌తోపాటు కార్‌వాలే, గ్రాబ్‌, ఆఫ్‌బిజినెస్‌, పేటీఎం వంటి కంపెనీలు ప్రాంగణ నియామకాలు బాగానే పెరిగాయి.

ప్రారంభ స్థాయిలో ఉన్న స్టార్టప్‌లు, చిన్న వ్యాపార సంస్థలు మహిళల నియామకంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. 

ప్రసూతి ప్రయోజనాలు కల్పించడం వల్ల తమ సంస్థలపై ఆర్థిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలో మహిళల నియామకాల నేపథ్యంలో స్టార్టప్ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఇటీవలి సర్వేలో తేలింది. అధిక వ్రుద్ధి సాధించే సామర్థ్యం గల స్టార్టప్‌లు, ఈ-కామర్స్ సంస్థలు ప్రతిభావంతుల కోసం పరుగులు తీస్తున్నాయని ఐఐఎం-కలకత్తాలోని కెరీర్ డెవలప్మెంట్ అండ్ ఫ్లేస్‌మెంట్ సంస్థ చైర్ పర్సన్ అభిషేక్ గోయల్ తెలిపారు. 

గతేడాదితో పోలిస్తే అధిక వేతనాలతో కూడిన ఆఫర్లు అందజేస్తున్నాయన్నారు. అయితే ఆయా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు చెప్పడానికి బిజినెస్ స్కూళ్ల యాజమాన్యాలు నిరాకరించాయి.