స్మార్ట్ ఫోన్లతో విపణిలోకి చౌకగా స్మార్ట్ టీవీలు
జియోతోపాటు ఇతర టెలికం ప్రొవైడర్లు చౌక చార్జీలకే డేటా అందిస్తున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు టీవీలను చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి పోటీ పడుతున్నాయి. భారతదేశం అంతటా మున్ముందు స్మార్ట్ ఫోన్లు నిండిపోనున్నాయి.
న్యూఢిల్లీ: ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ను గుప్పిట పెట్టుకొనేందుకు హోరాహోరీగా పోరాడిన కంపెనీలు ఇక తమ యుద్ధక్షేత్రాన్ని నెమ్మదిగా టీవీ మార్కెట్లకూ విస్తరిస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలు షియో మీ, రెడ్‌మీ, వన్‌ప్లస్, భారత్‌లోని మైక్రోమాక్స్ సంస్థలు చాలా వేగంగా స్మార్ట్ టీవీల మార్కెట్లోకి చొచ్చుకొస్తున్నాయి.
ఇప్పటికే ఈ మార్కెట్‌లో సోనీ, ఎల్‌జీ, శామ్‌సంగ్, పానాసోనిక్ వంటి సంస్థలు ఉన్నాయి. భారత్‌లో ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న టీవీలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారాయి. ముఖ్యంగా చౌకాగా డేటా టారీఫ్‌లు ఉండటం ఈ మార్కెట్‌కు కలిసివచ్చే అంశంగా మారింది.
దీనికి తోడు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ మంచి దూకుడులో ఉండటంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. గూగుల్ లెక్కల ప్రకారం ఆన్‌లైన్‌లో వీడియోలు చూసేవారి సంఖ్య 2020నాటికి భారత్‌లో 50 కోట్లను దాటేస్తుంది. రోజుకు కొత్తగా 40 లక్షల మంది ఇంటర్నెట్‌లో వీడియోలను చూడటం ప్రారంభించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
వచ్చేనెల ఐదో తేదీన జియో ఫైబర్ మార్కెట్లో అందుబాటులోకి వస్తే వీటి సంఖ్య మరీ వేగంగా పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్‌టీవీల్లో ప్రీఇన్‌స్టాల్ చేసిన ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉండటం కూడా కలిసి వచ్చే అంశంగా మారింది.
ఇప్పటికే షియోమీ టీవీలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. దీనికి తోడు తన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుంచి కూడా టీవీలను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఇప్పటికే ఈ సంస్థలు చౌకధరలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ వాటాను కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని స్మార్ట్‌టీవీల మార్కెట్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంఐ టీవీలు చౌకధరలకే లభిస్తున్నాయి.
వన్‌ప్లస్ ఫోన్లు ప్రీమియం ఫోన్లుగా మార్కెట్లో పేరుతెచ్చుకొన్నాయి. నాణ్యత పరంగా వీటిని యూజర్లు బాగా ఇష్టపడతారు. ఇప్పటికే వన్‌ప్లస్ 6, 6టీ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది.
సెప్టెంబర్‌లో స్మార్ట్‌టీవీలను కూడా విడుదల చేస్తామని వన్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ‘మేం గత ఆరేళ్లలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మాదైన ముద్ర వేశాం. వన్‌ప్లస్ టీవీ కూడా మాకు చాలా ముఖ్యమైంది. దీనిని భారతీయుల లివింగ్ రూముల్లో చూసేందుకు ఇక ఏమాత్రం వేచి చూడలేం’’ అని వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు పెటె లౌ తెలిపారు. భారత్‌తో పాటు చైనా, ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లలో కూడా దీనిని విడుదల చేయనుంది.
ఈ కంపెనీలు స్మార్ట్ టీవీల మార్కెట్లోకి అడుగు పెడితే ధరలు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గత ఏడాది ఈ మార్కెట్లోకి వచ్చిన షియోమీ ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ4ను రూ.39,999కే అందుబాటులోకి తెచ్చింది. 32 అంగుళాల టీవీని కేవలం రూ.12,999కు తీసుకొచ్చింది. దాదాపు 20లక్షల టీవీలను ఈ సంస్థ విక్రయించింది.
భారతీయ బ్రాండ్ మైక్రోమాక్స్ కూడా ఈ మర్కెట్లోకి దూసుకెళుతోంది. 2016-17లోనే స్మార్ట్‌టీవీల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌టీవీని రూ.13,999కే అందుబాటులోకి తెచ్చింది. 2019 తొలి త్రైమాసికం లెక్కలను చూస్తే స్మార్ట్ టీవీ విక్రయాల్లో షామీ 39 శాతం కైవశం చేసుకోగా.. ఎల్‌జీ 15, సోనీ 14శాతాలను దక్కించుకొన్నాయి.