ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు భారతీయులకూ ఉండటం లేదని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్‌ అధిపతి గిన్నీ రొమెట్టీ పేర్కొన్నారు. డిగ్రీలు పొందడానికి, ఇవ్వడానికే పరిమితం కాకుండా.. అంతకు మించి విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆలోచించాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు.

నైపుణ్య సమస్య కేవలం భారత్‌కే పరిమితం కాలేదని ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని ఐబీఎం అధినేత గిన్నీ రొమెట్టీ అన్నారు. భారత్‌లోనూ అవే సమస్యలున్నాయి. ఉద్యోగాలున్నాయి..కానీ వాటికి సరిపడా నైపుణ్యాలు లేవు.

డిగ్రీ కంటే నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని మీరు నమ్మాల్సి ఉంది’ అని ఆమె బుధవారమిక్కడ జరిగిన కంపెనీ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇంతకుముందు దేశీయంగా కూడా కొంత మంది ఐటీ కంపెనీల అధిపతులు ఇదే సంగతిని బయటపెట్టిన సంగతి తెలిసిందే.

దేశంలో ప్రత్యక్షంగా 40 లక్షల మందికి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ ఉపాధి కల్పిస్తున్నాయి. 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 60 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే సుమా. పరోక్షంగా కోట్ల మంది ఉపాధి పొందుతున్న నేపథ్యంలో, ఐబీఎం అధిపతి గిన్నీ రోమెట్టి వ్యాఖ్యలపై ఆలోచించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

సీఎంఐఈ తెలిపిన గణాంకాల ప్రకారం గత నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 3.12 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ‘అనుభవం ఉండి, పాక్షిక నైపుణ్యాలు ఉన్న వారితో పోలిస్తే, ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో చేరుతున్న అర్హత కల ఇంజినీర్లకు తక్కువ వేతనాలు ఉండడానికి కారణం అదే.

లక్షల కొద్దీ ఇంజినీర్లు, బిజినెస్‌ స్కూల్‌ గ్రాడ్యుయేట్లలో నాలుగింట మూడొంతుల మందికి ఉద్యోగాలు లభించడం లేదు. పాఠ్యాంశాల నాణ్యత పెరగాలి. దేశ విద్యా వ్యవస్థలో ప్రవేశప్రక్రియ కూడా మారాలి’అని ఐబీఎం అధినేత గిన్నీ రొమెట్టి సూచించారు.

‘యూనివర్సిటీ డిగ్రీ కంటే తక్కువ అర్హత ఉన్నా.. అనుభవంతో పరిశ్రమలో భాగస్తులైన వారు కూడా ఉన్నారు. ఉద్యోగాల కొరత ఉందని అనుకుంటారు కానీ.. ఉద్యోగాలు చాలా ఉన్నాయి. కానీ వాటికి తగ్గ నైపుణ్యాలు ఉన్న వారు లభించడమే అసలు సమస్యగా ఉంది.

వ్యాపార వర్గాలు, ప్రభుత్వాలు కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి’ అని గిన్నీ రొమెట్టి తెలిపారు. ‘ఈ సరికొత్త ప్రపంచంలో నైపుణ్యాలు ఉన్న వారు, లేని వారు అంటూ ఉండకూడదు. కానీ చాలా కొద్ది మందికే సరికొత్త సాంకేతిక యుగంలో ఎలా పని చేయాలో తెలుసు.. చాలా మందికి ఆ విజ్ఞానం ఉండడం లేదు’ అని గిన్ని రొమెట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వచ్చాక ఉద్యోగాలను తగ్గిస్తోందా అన్న ప్రశ్నకు ఐబీఎం అధినేత గిన్నీ రొమెట్టి సమాధానిమస్తూ.. ‘ఉద్యోగాల స్వభావంలో మాత్రమే మార్పు వస్తుంది’అని అన్నారు. అవసరమైన నైపుణ్యాలు అభ్యసిస్తే, ఉద్యోగం తప్పనిసరిగా లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.