అమెరికా ఔట్: 5జీ సేవల్లో చైనా ఫస్ట్
అగ్రరాజ్యం అమెరికాను తోసిరాజని ‘5జీ’ సేవలను ప్రారంభించడంలో చైనా ముందు నిలిచింది. షాంఘైలోని హాంకూ జిల్లాలో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ప్రతి విషయంలో ముందుండే అమెరికాను తాజాగా ‘డ్రాగన్’ చైనా వెనక్కి నెట్టేసింది. మొబైల్ ఇంటర్నెట్‌లో నవ శకానికి నాంది పలికింది. అమెరికాతోసహా ఇతర అగ్రదేశాలకు టెక్నాలజీలో సవాల్ విసురుతూ 5జీ కవరేజీ, బ్రాడ్‌బాండ్ గిగాబైట్ నెట్‌వర్క్ వినియోగాన్ని తొలిసారి పరిచయం చేసింది.
ఈ క్రమంలోనే ప్రపంచంలోనే తొలి 5జీ కవరేజీ జిల్లాగా షాంఘై పరిధిలోని హాంకూ రికార్డు సృష్టించిందని చైనా అధికార దినపత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి చైనా ముందడుగు వేసినట్లైంది.
సెల్యూలార్ టెక్నాలజీలో తర్వాతీ తరంగా పేర్కొంటున్న 5జీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్స్‌లో కంటే కూడా 10 నుంచి 100 రెట్లు అధికంగా డౌన్‌లోడ్ వేగం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 4జీ సేవలే అందుబాటులో ఉన్నాయి. దీంతో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి అమెరికాసహా అగ్రదేశాలన్నీ పరుగులు పెడుతున్న నేపథ్యంలో చైనా ఆ ఘనతను సాధించి అందరినీ ఆకర్షించింది.
‘ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్‌ను అధికారికంగా శనివారం నుంచి ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినట్లైంది’ అని చైనా డైలీ తెలిపింది.
5జీ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా షాంఘై వైస్ మేయర్ వూ క్వింగ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి 5జీ ఫోల్డబుల్ ఫోన్ అయిన హువాయ్ మేట్ ఎక్స్ నుంచి తొలి 5జీ వీడియోకాల్‌ను చేశారు.
వినియోగదారులు తమ సిమ్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. పూర్తిస్థాయిలో కవరేజీ కోసం గడిచిన మూడు నెలలకుపైగా 5జీ బేస్ స్టేషన్లను ఇక్కడ చైనా మొబైల్ ఏర్పాటు చేస్తూ వచ్చింది.
టిబెట్‌సహా చైనాలోని పలు ప్రాంతాల్లో 5జీ స్టేషన్లను ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు హువావే ఆయా దేశాల రక్షణకు ప్రమాదం తెచ్చేలా టెక్నాలజీని విస్తరిస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో అదే సంస్థ ఫోన్‌పై ఇప్పుడు 5జీ సేవలు ప్రారంభించడంతో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికాతోపాటు మరికొన్ని దేశాలూ హువావీ 5జీ ట్రయల్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి.