మొబైల్ యాప్‌తో 'ఎస్బీఐ కార్డ్' పేమెంట్స్ ఈజీ
వాణిజ్య లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్బీఐ కార్డ్ నూతన ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. కార్డ్, పిన్ అవసరం లేకుండానే మొబైల్ యాప్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేందుకు 'ఎస్బీఐ కార్డ్ పే' సేవలను ప్రారంభించింది. ఇటువంటి సేవలు భారతదేశంలో ఇదే ప్రథమం.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసే.. 'ఎస్బీఐ కార్డ్ పే' సేవలను ప్రారంభించింది ఎస్బీఐ కార్డ్. ఈ కొత్త ఫీచర్‌తో కాంటాక్ట్ లెస్ పేమెంట్లను స్వీకరించే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)ను ఉపయోగించవచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డ్‌ను భౌతికంగా వినియోగించే అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.
ఎస్బీఐ కార్డ్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించేందుకు ముందు ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఇక పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్‌కు దగ్గరలో స్మార్ట్ ఫోన్‌ను ఉంచి సులభంగా చెల్లింపులు జరపొచ్చని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ హర్ దయాళ్ ప్రసాద్ తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థ 'వీసా' కార్డుపై ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
హోస్ట్ కార్డ్ ఎమ్యులేషన్ (హెచ్సీఈ) టెక్నాలజీ ఆధారంగా ఎస్బీఐ కార్డుల పే యాప్ పని చేస్తుంది. భారతదేశంలో ఈ తరహా చెల్లింపులు ఇదే మొదటిసారని ఎస్బీఐ పే తెలిపింది. రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్ కు అనుగుణంగా ఎస్బీఐ కార్డు పే వ్యవస్థను సెట్ చేయొచ్చు.
ప్రస్తుతం రూ.2000 నుంచి రూ.10 వేల వరకు ఎస్బీఐ కార్డు పే ద్వారా చెల్లించొచ్చు. ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్ కాట్ వర్షన్ 4.4 కంటే పై గల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ కార్డుకు 90 లక్షల ఖాతాదారులు ఉన్నారు. ఇది భారతదేశంలోని క్రెడిట్ కార్డుల మార్కెట్లో 17 శాతం.