న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ‘ఆపిల్’ ఐఓఎస్, మాక్ ఓఎస్ లక్ష్యంగా ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయని ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ కాస్పర్ స్కై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే విండోస్, ఆండ్రాయిడ్‌లపై పోలిస్తే ఈ దాడులు తక్కువేనని ‘థ్రెట్ టు మాక్ యూజర్స్ -2019’ అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో వ్యాఖ్యానించింది.

2019 తొలి అర్ధభాగంలో మాక్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ ఫోన్లపై 16 లక్షల ఫిషింగ్ దాడులు జరిగాయని కాస్పర్ స్కై తెలిపింది. 2018తో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగిన సైబర్ దాడులు దాదాపు తొమ్మిది శాతం ఎక్కువ అని వివరించింది.

ఆపిల్ కంప్యూటర్లపై జరిగే అధిక దాడుల్లో ఐక్లౌడ్ సేవలను అనుకరిస్తూ జరిగేవే ఎక్కువ అని కాస్పర్ స్కై తెలిపింది. ఈ క్రమంలో దాడులకు పాల్పడే హ్యాకర్లు కంప్యూటర్ల వినియోగదారుల నుంచి ఆపిల్ ఐడి ఖాతాల వివరాలను తస్కరించి సొమ్ము చేసుకుంటున్నారని కాస్పర్ స్కై ఆందోళన వ్యక్తం చేసింది.

ఆపిల్ టెక్నికల్ సపోర్ట్ పేరిట ఈ-మెయిల్స్ రూపంలో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు లబ్ధి పొందుతున్నారని కాస్పర్ స్కై పేర్కొంది. పరిశీలించడానికి పంపిన లింక్‌ను క్లిక్ చేయాలని అందులోని వినియోగదారులకు సూచిస్తారు. లేకపోతే ఆపిల్ ఖాతా డీయాక్టివేట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారని హెచ్చరించింది.

చాలా మంది వినియోగదారులు అసలు సంగతిని గుర్తించడానికి బదులు దానిపై క్లిక్ చేసి ఇరుక్కు పోతున్నారు. ఈ సైబర్ దాడులకు బ్రెజిల్ అతిపెద్ద బాధిత దేశం అని కాస్పర్ స్కై హెచ్చరించింది. బ్రెజిల్‌లో 30.9 శాతం దాడులు జరుగుతున్నాయి. తర్వాతీ జాబితాలో భారత్, ఫ్రాన్స్ దేశాల్లో అత్యధికులు సైబర్ దాడులకు గురవుతున్నారని కాస్పర్ స్కై తెలిపింది.

భారతదేశంలో దాడులు 22.1 శాతం కాగా, ఫ్రాన్స్‌లో 22 శాతం దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డు నంబర్లు, బ్యాంకింగ్, ఫైనాన్సిల్ లావాదేవీల వివరాలను తస్కరించేస్తున్నారని కాస్పర్ స్కై హెచ్చరించింది. సైబర్ అటాకర్లు స్పామ్ ఈ-మెయిల్స్ ద్వారా లింకులు పంపి మరీ సమాచారం తస్కరిస్తున్నారు.