న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్‌ ప్లస్‌ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నది. ఈనెల 10వ తేదీన లండన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. భారతదేశంలోనూ అదే రోజు ఆవిష్కరించనుందని అంచనా. 

ఈ- కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌లో  ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ఇక వన్ ప్లస్ 7టీ మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో  ఫీచర్లు  ఉండనున్నాయట. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో రానున్న మొదటి ఫోన్‌ ఇదే.

వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ ఫోన్ 6.65 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పనిచేసే తొలి స్మార్ట్ ఫోన్ కానున్నది. స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోపాటు 1440 x 3120 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది.

వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్ ఇంకా 8 జీబీ ర్యామ్ విత్ 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో 48+8+16 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 16ఎంపీ  సెల్పీ కెమెరా, 4085 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 30టీ రాప్ టెక్నాలజీ కూడా చేర్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.49,999 ఉంటుందని అంచనా. 

ఈ ఫోన్లు రిలయన్స్ డిజిటల్, క్రోమా షోరూమ్‌ల్లో లభిస్తాయి. అమెజాన్ సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ నెల 15 నుంచి వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్ లభ్యం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు కొనుగోలు చేస్తే రూ.3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.