17న ఇండియాలోకి గేమింగ్ ‘రెడ్ మ్యాజిక్ 3ఎస్’
అక్టోబర్ 17వ తేదీన భారతదేశ విపణిలోకి నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ రానున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే వినియోగదారులకు లభ్యం కానున్నది. గేమ్స్ ప్రధానంగా ఉన్న ఈ ఫోన్‌లో 48 ఎంపీల కెమెరా ఉంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో గేమింగ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ గేమింగ్ ఫోన్ల తయారీ సంస్థ నుబియా విపణిలోకి ఈ నెల 17న రెడ్ మ్యాజిక్ 3 ఎస్ పేరిట నూతన ఫోన్ విడుదల చేయనున్నది. అంతర్జాతీయంగా ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో బుధవారం ఆవిష్కరించనున్నారు.
జూన్ నెలలోనే నుబియా సంస్థ రెడ్ మ్యాజిక్ 3 పేరిట ఒక ఫోన్‌ను విడుదల చేసింది. దాని కొనసాగింపుగానే కొద్దిపాటి మార్పులతో రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ తీసుకొస్తున్నట్లు నుబియా తెలిపింది.
ఇందులో స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ చిప్ సెట్ ఉంటుందని సమాచారం. 8జీబీ, 12 జీబీ విత్ 256 జీబీ యుఎఫ్ఎస్ 3.0 స్టోరేజీ సామర్థ్యం ఈ ఫోన్ లో ఉంటుందని తెలుస్తున్నది. ఇంకా దీనిలో యాక్టివ్ కూలింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
6.65 అంగుళాల 90 హెడ్జ్స్ అమోలెడ్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లేతో రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ వినియోగదారుల ముంగిట్లోకి రానున్నది. ముందు భాగంలో రెండు స్టీరియో స్పీకర్లు అమర్చారని తెలుస్తున్నది. ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగా పికసెల్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ 48 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.
ఇది హెచ్డీఆర్ వీడియోలతోపాటు 8కే వీడియోలను కూడా రికార్డు చేయనున్నది. ఇందులో 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనున్నది.
వెనుక వైపున ఫింగర్ ఫ్రింట్ స్కానర్ తోపాటు కుడివైపు గేమింగ్ కోసం రెండు బటన్లు ఉంటాయి. దీని ధర రూ.40 వేల వరకు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు సాగనున్నాయి.