నిపుణులకు ప్రతిఏటా అమెరికా ప్రభుత్వం ఇచ్చే హెచ్‌-1బీ వీసాల్లో 70శాతం వరకు భారతీయులకే దక్కుతున్నాయి. కొన్నేళ్లుగా భారతీయ నిపుణులకు దక్కే ఈ వీసాల వాటా పెరుగుతోంది. వాటిని పొందేవారిలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. 

ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ సేవలను అందిస్తుండటం.. ఆ రంగంలోని నిపుణులు భారత్‌లోనే అధికంగా ఉండటంతో హెచ్‌-1బీ వీసాలు ఎక్కువగా వారికి దక్కుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వీసాల జారీలో ఒక్కో దేశానికి గరిష్ఠంగా 15 శాతానికి మించి ఇవ్వరాదన్న ప్రతిపాదన ఇటీవల వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.

అమెరికాలో కంపెనీలు ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువ. వాటికి అవసరమైన నిపుణులు అక్కడ లేనందున విదేశాల్లోని నిపుణులను తమ ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. అందుకు ముందుగా హెచ్‌-1బీ వీసా కోసం సర్కార్‌కు ఆ కంపెనీలు దరఖాస్తు చేస్తాయి. 

దీన్ని తాత్కాలికంగా ఆ దేశంలో పని చేయడానికి ఇచ్చే వీసాగా చెప్పొచ్చు. కంపెనీల ద్వారా అందిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. భారత్‌లో ఏటా బీటెక్‌ పూర్తి చేస్తున్న 7-8 లక్షల మందిలో దాదాపు 50 వేల మంది వరకు అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు వెళ్తున్నారు. 

అమెరికాలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేందుకు వెళుతున్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాల వాటా 30% వరకు ఉంటుందని అంచనా. వారిలో కూడా అక్కడ 80% వరకు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగే పూర్తిచేస్తారు. అక్కడ రెండేళ్లపాటు చదివాక మూడేళ్లపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ద్వారా కంపెనీల్లో ఉద్యోగం చేయవచ్చు.

మూడేళ్ల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా పని చేస్తూ.. ఆ లోపు హెచ్‌-1బీకి దరఖాస్తు చేసుకుంటారు. వస్తే అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. భారతీయ విద్యార్థులు.. వీసా రాకుంటే చాలా  మంది తక్కువ రుసుం గల యూనివర్సిటీల్లో మరో పీజీ చేస్తుంటారు. అమెరికాలో ప్రస్తుతం ఓపీటీ చేస్తున్న వారితో కలుపుకొని 2.10 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.