న్యూఢిల్లీ: టెలికం రంగంతోపాటు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలందించడంలో సంచలనాలకు సిద్దమైన రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్ టెల్ గట్టి సవాల్ విసిరింది. తద్వారా దేశంలో ఫైబర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ అందించే సేవల విభాగంలో పోటీ క్రమంగా వేడెక్కుతోంది. 

ఇటీవలే రిలయన్స్‌ జియో ఈ రంగంలో జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జియోను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ మరింత ఆకర్షణీయ సేవలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. 

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ పేరుతో ఇంటర్నెట్‌ వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ద్వారా నెలకు రూ.3999 చెల్లిస్తే 1 జీబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపింది. 

ఈ ప్లాన్‌ను హైదరాబాద్‌తో సహా దేశంలోని 15 ప్రధాన నగరాల్లో అందుబాటులో తెచ్చింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్‌ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు వినియోగదారులకు ఆ సంస్థ మరికొన్ని అదనపు ప్రయోజనాలను చేకూర్చనుంది. 

ఈ ప్లాన్ వ్యక్తిగత యూజర్లతోపాటు వాణిజ్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది ఎయిర్ టెల్. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, ముంబై, నోయిడా, పుణె నగరాల పరిధిలో ఈ సేవలు ప్రవేశపెట్టింది. 

ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు దేశవ్యాప్త అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందించనుంది. అంతేకాక ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ద్వారా మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ చందా, ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు జీ5 ప్రీమియం కంటెంట్‌ను కూడా అందించనుంది. 

ఎయిర్‌టెల్‌ సంస్థ ఈ ప్లాన్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జియో ఫైబర్ ప్లాటినం ఆఫర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీం ఫైబర్ ఒకే ధరతో అంటే రూ.3999లకే ఒక జీబీ ఎంబీపీఎస్ డేటా అందిస్తున్నాయి. 

పైగా జియోతో పోలిస్తే ఎయిర్ టెల్ నెలసరి ఎఫ్ యూపీ డేటా ఇంకా ఎక్కువగానే ఇస్తోంది. జియో నెలవారీ ఎఫ్ యూపీ 2500 జీబీ ఇవ్వనుండగా, ఎయిర్ టెల్ 3333 జీబీ అందిస్తోంది. రెండు ప్లాన్లలోనూ అపరిమిత కాలింగ్ వసతి కూడా ఉంది. జియో ద్వారా ఓటీటీ యాప్స్ వార్షిక సభ్యత్వం కూడా పొందొచ్చు.