Asianet News TeluguAsianet News Telugu

ఇక ‘ఐటీ’లో కొలువుల కోలాటమే! కేంద్రంలో నూతన సర్కార్ కీలకమే

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలకు తోడు కేంద్రంలో కొలువు తీరే నూతన ప్రభుత్వం ప్రోత్సాహాకాలు అందజేస్తే ఐటీ పరిశ్రమ దూసుకెళ్లనున్నది. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్న ఐటీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయ సంఖ్యలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 
 

IT Sector Jobs would go up
Author
New Delhi, First Published Apr 14, 2019, 10:45 AM IST

దేశీయ ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయ స్థాయిలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతోపాటు సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటును బట్టి ఆయా ఐటీ సంస్థలు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌.. గత ఆర్థిక సంవత్సరంలో 53 వేల మందిని కొత్తగా నియమించుకున్నాయి. టీసీఎస్‌ 29,287 మందిని నియమించుకోగా ఇన్ఫోసిస్‌ 24,016 మందిని రిక్రూట్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. 

2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 4,24,285కు చేరుకోగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సంఖ్య 2,28,123గా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ సంస్థలు కేవలం 11 వేల మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నాయి.

విప్రో, హెచ్‌సీఎల్‌, కాగ్నిజెంట్‌ సంస్థలు కూడా ఓ మోస్తరు స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కంపెనీలు దాదాపు 50 వేల వరకు నియామకాలు చేపట్టాయి. త్వరలోనే ఈ కంపెనీల ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ కంపెనీలు భారీగానే ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులతోపాటు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండటం కలిసి రానుందని నిపుణులు భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత రాబోయే కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలను అందిస్తే రిక్రూట్‌మెంట్‌ ఆశించిన స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా డిజిటల్‌ వ్యాపారంపై దృష్టి సారించటంతో నియామకాలు పెరగటానికి దోహదపడిందన్నారు.
 
ఆటోమేషన్‌, ప్రాజెక్టులు లేకపోవటం, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మారిపోవటం సహా ఇతరత్రా అంశాలతో దేశీయంగా పలు ఐటీ కంపెనీలు.. చాలా మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్పులు అందజేశాయి. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరించటం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. 

గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో పరిస్థితి మెరుగుపడటం కలిసి వచ్చింది. కొత్తగా ప్రాజెక్టులను చేజిక్కించుకోవటం, నయా టెక్నాలజీలకు అనుగుణంగా నిపుణులు లభించటం వంటి అంశాలతో రిక్రూట్‌మెంట్‌ పెరిగిందని ఐటీ రంగ నిపుణులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios