డిజిటల్ ఇండియాలో 'గూగుల్ ' భాగస్వామి
ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్రం రూపొందించిన కార్యక్రమం 'బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా'లో గూగుల్ సంస్థ భాగస్వామి కానున్నది. ఈ మేరకు టెక్ దిగ్గజంతో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకునే వేదికే బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా థీమ్. డిజిటల్ ఇండియా నిర్మాణంలో ఇక నుంచి గూగుల్ పాలుపంచుకోనుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది.
దేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలను వ్యక్త పరిచే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
"దేశంలోని అన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకు అన్ని విషయాల్లో సహాయం అందిస్తుంది. ఐఐటీతో పాటు సాధారణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, నూతన సాంకేతికతను అలవడేలా గూగుల్ కృషి చేస్తుంది. ఇందుకు గూగుల్ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాలు, మహిళల భద్రత, రవాణా, పర్యావరణం, డిజిటల్ అక్షరాస్యత ఇలా చాలా అంశాలను పొందుపరిచారు. విద్యార్థులు మెషీన్ లెర్నింగ్, క్లౌడ్, ఆండ్రాయిడ్ సాంకేతికతలను నేర్చుకునేందుకు గూగుల్ సంస్థ సహకరిస్తుంది.
గూగుల్ డెవలపర్ స్టూడెంట్ క్లబ్ నెట్వర్క్ ద్వారా ఈ అంశాలను ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికల్లో నేర్చుకునేందుకు వీలు కల్పిస్తారు. ప్రొడక్ట్ డిజైన్, సాంకేతికతకు రంగాల్లో మెంటార్షిప్ సెషన్స్ కూడా నిర్వహిస్తుంది.