Asianet News TeluguAsianet News Telugu

సెర్చింజన్ ‘గూగుల్’ నుంచి ఇక క్రెడిట్ కార్డులు

వినియోగదారులకు గూగుల్ మరికొన్ని వసతులను గూగుల్ పేలో తీసుకు వస్తున్నది. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘గూగుల్ ఫర్ ఇండియా` కార్యక్రమంలో వీటిని ప్రకటించింది. ఇందులో ఒకటి టోకెనైజ్డ్ కార్డులు కాగా, మరొకటి స్పాట్ ప్లాట్ ఫాం.

Google Pay will now support tokenised debit and credit cards
Author
Hyderabad, First Published Sep 20, 2019, 2:02 PM IST

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ గా పేరొందిన గూగుల్ త్వరలో క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే గూగుల్ పేమెంట్స్ యాప్ ‘గూగుల్ పే` అందరికి సుపరిచితమే. అనతి కాలంలోనే అతిపెద్ద పేమెంట్ ప్లాట్ ఫాంగా అవతరించింది. 

ఈ నేపథ్యంలో వినియోగదారులకు గూగుల్ మరికొన్ని వసతులను గూగుల్ పేలో తీసుకు వస్తున్నది. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘గూగుల్ ఫర్ ఇండియా` కార్యక్రమంలో వీటిని ప్రకటించింది. ఇందులో ఒకటి టోకెనైజ్డ్ కార్డులు కాగా, మరొకటి స్పాట్ ప్లాట్ ఫాం.

దేశంలోని కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ కొనుగోళ్లకు కార్డు వివరాలతోపాటు సీవీవీ తదితర వివరాలు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఇలా చేయడంతో ఆన్ లైన్ మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో గూగుల్ పే టోకెనైజ్డ్ కార్డుల పేరిట కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా మన క్రెడిట్/ డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలేమీ ఇవ్వకుండానే గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇందుకోసం మన కార్డులను గూగుల్ పేలో యాడ్ చేసుకోవాలి. 

ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాల ఆధారిత పేమెంట్ సేవలు మాత్రమే గూగుల్ పేలో అందుబాటులో ఉండగా, ఇకపై కార్డులనూ వినియోగించుకునే వెసులుబాటు రానున్నది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల వీసా కార్డులకు ఈ సదుపాయాన్ని గూగుల్ పే అందుబాటులోకి తెచ్చింది. 

త్వరలో మాస్టర్ కార్డు, రూపే కార్డులకూ ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ముఖ్యంగా విక్రేతలను దృష్టిలో పెట్టుకుని గూగుల్ రూపొందించిందే స్పాట్ ప్లాట్ ఫాం. ఇప్పటివరకు కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి సైట్ గానీ, యాప్ గానీ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది.

గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫామ్ ద్వారా వ్యాపారులు అలాంటివేమీ క్రియేట్ చేయకుండానే గూగుల్ పేలో నమోదు కావచ్చు. దీనివల్ల తమ ఉత్పత్తుల పూర్తి సమాచారం వినియోగదారులకు ప్రత్యక్షమవుతుంది. కస్టమర్ బస్ టిక్కెట్, ఆన్ లైన్ ఫుడ్ గానీ వేరే యాప్ లోకి వెళ్లకుండా నేరుగా స్పాట్ ప్లాట్ ఫాంను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. పేమెంట్ కూడా అక్కడే పూర్తి చేయొచ్చు. 

ప్రస్తుతానికి మేక్ మై ట్రిప్, ఈట్. ఫిట్. గో ఐబిబో, ఓవెన్ స్టోరీ, రెడ్ బస్, అర్బన్ క్లాప్ విక్రేతలకు గూగుల్ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. త్వరలో ఈ సదుపాయాన్ని మరిన్ని కంపెనీలకు అందుబాటులోకి తేనున్నది. ఈ రెండు కొత్త ఫీచర్లను వినియోగించుకోవాలంటే వినియోగదారులు గూగుల్ పే యాప్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios