న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ‘ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.

ఫ్లిప్ కార్ట్ ఫార్మర్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్థానిక ఉత్పత్తులతోపాటు ప్యాకేజ్‌డ్ ఫుడ్‌ను నేరుగా వినియోగదారులకు ఫ్లిప్‪కార్ట్ అందించనున్నది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా వీటిని విక్రయించనున్నది.

స్థానిక చట్టాలకు అనుగుణంగానే వ్యాపారం చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ వ్యాపారం కోసం ఫ్లిప్‌కార్ట్ రూ.1,845కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. కొత్త వ్యాపారం కోసం ఇప్పటికే వేల మంది రైతులను సంప్రదించినట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వారందరితో కలిసి పనిచేస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.

దేశంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవోస్), ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఎంతోమంది రైతులకు ఆదాయాన్ని ఇస్తున్నాయని, అలాగే నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ధరకే లక్షల మందికి అందిస్తున్నాయని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి వివరించారు.

ఫ్లిప్‌కార్ట్‌ ప్రధాన ప్రత్యర్థి సంస్థ అమెజాన్ ఇటీవల తన ఫుడ్ రిటైల్ బిజినెస్‌ను విస్తరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ తాజా ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో 500 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ ఇటీవల పేర్కొంది.

అమెజాన్ ఇండియా ఇప్పటికే అమెజాన్ నౌ, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ఫ్రెష్ వంటి వ్యాపారాలనూ మొదలుపెట్టింది. ఈ-కామర్స్ సంస్థలు ఆహార పదార్థాలను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి భారతీయ చట్టాలు అనుమతిస్తున్నాయి. ఇతర ఉత్పత్తులను మాత్రం థర్డ్‌పార్టీ సెల్లర్లతోనే విక్రయించాల్సి ఉంటుంది.