న్యూజిలాండ్ ప్రధాని ఫైర్.. 15 లక్షల వీడియోలను తొలగించిన ఫేస్‌బుక్

శుక్రవారం న్యూజిలాండ్ క్రెస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదులపై దాడి ఘటనను వీడియో గేమ్ తరహాలో సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోలపై న్యూజిలాండ్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Facebook Removed 1.5 Million Videos of the New Zealand Mosque Attack Within 24 Hours

ఫేక్‌ న్యూస్‌,  హింసాత్మక  వీడియోలను నిరోధించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పేర్కొంది. న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ ఈ ఘటనపై ఆదివారం ఫేస్‌బుక్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో సంస్థ స్పందించింది.

న్యూజిలాండ్‌ నరమేధం ఘటనలో నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్‌ తీసివేయడానికి తీవ్రంగా శ్రమించామని ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన 24 గంటల్లోనే 15 లక్షల వీడియోల ఫుటేజ్‌లను తొలగించామని పేర్కొంది.

వీడియోగేమ్‌ తరహాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసిన వీడియోలను తొలగించామని న్యూజిలాండ్‌ ఫేస్‌బుక్‌ ప్రతినిధి మియా గార్లిక్‌ తెలిపారు. మరో 12లక్షల వీడియోల అప్‌లోడ్‌ను బ్లాక్‌ చేశామన్నారు.  

క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో నిందితుడు బ్రెట్టాన్ టారాంట్ తన దాడిని ఫేస్‌బుక్‌లో దాదాపు 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో  ఫేస్‌బుక్‌లో అతని అనుచరులు మొదట ఈ విషయం గురించి ముందుగా తెలుసుకున్నారు.

దీనిపై న్యూజిలాండ్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి హింసాత్మక వీడియోలు సోషల్‌  మీడియాలో విరివిగా షేర్‌ అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం చెల్లదని, ఎడిట్‌ చేసిన వీడియోలైనా సరే, సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట​ కావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

ఈ నిబంధనలు న్యూస్‌ మీడియాకూ వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లైవ్‌ వీడియో ఫుటేజ్‌ను ప్రసారం చేసిన స్కై న్యూస్‌ ఏజెన్సీని న్యూజిలాండ్‌ బ్రాడ్‌కాస్టర్‌ జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో మసీదుల్లో శుక్రవారం ఉదయం జాత్యంహకారి జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారితోపాటు ఏడుగురు భారతీయులు కూడా  ఉన్న సంగతి తెలిసిందే.

మరి కొందరు భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు గన్‌ కల్చర్‌కి వ్యతిరేకంగా దేశంలో ఒక చట్టాన్ని తెచ్చేందుకు తమ క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా సోమవారం చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios