Asianet News TeluguAsianet News Telugu

5జీ సేవల్లోనూ టాప్ లేపాలనుకుంటున్న జియో...వ్యూహాలివే

మార్కెట్‌లో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ జియో.. 5జీ సేవల్లోనూ ముందు ఉండాలని తలపోస్తున్నది. తద్వారా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను నిలువరించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 5జీ సేవల ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. 
 

Expect Jio to roll out 5G by second half of 2020: SBICap Securities
Author
New Delhi, First Published Mar 16, 2019, 2:15 PM IST

ముంబై: వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలందించే సేవలకు దీటుగా టెలికం రంగం సంచలనం జియో నెట్‌వర్క్‌ మరో అడుగు ముందుకు వేసింది. వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవల ప్రారంభానికి కసరత్తులు మొదలు పెట్టింది. 

ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న 4జీ
ఇప్పటివరకు మనం దేశంలో 2జీ,3జీ, 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 4జీ కూడా ఇటీవలే ప్రాచుర్యం పొందుతోంది.  తాజాగా వివిధ స్మార్ట్ ఫోన్ సంస్థలు 5జీ మోడల్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా 5జీ స్పెక్ట్రం కేటాయింపులను పూర్తి చేయాల్సి ఉన్నది. 

కస్టమర్లకు నాణ్యమైన సేవలకు రిలయన్స్ జియో రెడీ
అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ‘జియో కుటుంబంలో ఇప్పటికి 28 కోట్ల మంది సభ్యులు వచ్చి చేరారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్స్‌లో జియో ఒక్కటిగా నిలిచింది. దేశ ప్రజలకు జియో చాలా బాగా కనెక్టైంది. ఇంతగా ఆదరించిన కస్టమర్లకు మరింత స్పీడ్‌తో, నాణ్యతతో 5జీ సేవలందించేందుకు సిద్ధం అవుతున్నాం’ అని తెలిపారు. 

అధ్యయనం చేశాక పూర్తిస్థాయిలో 5జీ సేవలపై నిర్ణయం
‘ప్రస్తుతం జియోలో నెలకొన్న కొన్ని సమస్యలకు పరిష్కారం వెతికే పనిలో ఉన్నాం. దేశంలోని పరిస్థితులను కొద్ది రోజుల పాటు అధ్యయనం చేస్తాం. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఒకేసారి 5జీ సేవలు ప్రారంభించాలా? లేదా? అనేది నిర్ణయిస్తాం’ అని ముకేశ్ అంబానీ తెలిపారు.

డేటా కంటే ముందు నెట్ వర్క్ సేవలే ప్రారంభం
డేటా వాడకం ఎక్కువ ఉన్నా 5జీ సర్వీసులను ఉపయోగించే సామర్థ్యం గల టెక్నాలజీ దేశంలో అందుబాటులో లేదు. ఈ క్రమంలో 5జీ మొబైల్ ఫోన్ల కంటే ముందు నెట్‌వర్క్‌ సేవలే ప్రారంభం అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

‘డౌన్‌లోడ్‌’టాపర్ జియో.. అప్ లోడింగ్‌లోనూ బెటరే
రిలయన్స్‌ జియో ఫిబ్రవరిలో అత్యంత వేగవంతమైన టెలికం సంస్థగా నిలిచినట్లు ట్రాయ్‌ తెలిపింది. జియో నెట్‌వర్క్‌లో సగటు డౌన్‌లోడ్‌ వేగం సెకన్‌కు 20.9 ఎంబీగా నమోదైంది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా జనవరి గణాంకాలతో పోలిస్తే పెద్దగా మార్పు లేకుండా వరుసగా 9.4 ఎమ్‌బీపీఎస్‌, 6.7 ఎమ్‌బీపీఎస్‌ వేగాన్ని నమోదు చేసుకున్నాయని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

సగటు వేగంలో మెరుగైన ఐడియా డౌన్ లోడ్
ఐడియా సగటు డౌన్‌లోడ్‌ వేగం విషయంలో మెరుగైంది. జనవరిలో 5.5 ఎమ్‌బీపీఎస్‌ వేగం ఉండగా.. ఫిబ్రవరికి 5.7 ఎమ్‌బీపీఎస్‌కు చేరింది. వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ వొడాఫోన్‌ ఐడియాగా విలీనం అయినప్పటికీ.. ట్రాయ్‌ విడివిడిగానే పనితీరును లెక్క గట్టింది.

అప్‌లోడ్‌లో వొడాఫోన్ దే పైచేయి 
అప్‌లోడ్‌ విషయంలో వొడాఫోన్‌ అత్యధికంగా 6 ఎమ్‌బీపీఎస్‌ వేగాన్ని నమోదు చేసింది. జనవరిలో ఇది 5.4 ఎమ్‌బీపీఎస్‌గా ఉంది. ఇక ఐడియా, ఎయిర్‌టెల్‌  జనవరితో పోలిస్తే కాస్త తగ్గి 5.6 ఎమ్‌బీపీఎస్‌, 3.7 ఎమ్‌బీపీఎస్‌గా నమోదు చేసుకున్నాయి. 

అప్ లోడ్‌లో జియో ఇన్ ‘స్వింగ్’
రిలయన్స్ జియో కాస్త మెరుగై 4.5 ఎమ్‌బీపీఎస్‌ సగటు అప్‌లోడ్‌ వేగాన్ని అందుకుంది. వినియోగదార్లు ఏదైనా వీడియో వీక్షిస్తున్నపుడు, బ్రౌజింగ్‌ చేస్తున్నపుడు, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను వీక్షించాలనుకున్నపుడు డౌన్‌లోడ్‌ వేగం కీలకంగా మారుతుందన్న సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios