ప్రస్తుతం దేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ సంగ్రామం నడుస్తున్న వేళ దేశ వ్యాప్తంగా యువతతోపాటు క్రికెట్‌ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను చూస్తున్నారు.

ఇక్కడ మ్యాచ్‌ల కంటే కూడా విరామ సమయంలో ప్రసారం అవుతున్న వివిధ డిజిటల్‌ వాలెట్‌ పేమెంట్‌ చెల్లింపుల సంస్థల ప్రకటనలు అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయా సంస్థలు పోటీపడి మరీ ప్రకటనలను ఇస్తున్నాయి.

వీటి తీవ్రతను చూస్తుంటే భారత్‌లో డిజిటల్‌ వాలెట్ల మధ్య పరోక్ష యుద్ధం జోరందుకుందని తెలుస్తున్నది. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2023 నాటికి ఇది ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

'క్రెడిట్‌ సూ' అంచనాల ప్రకారం వీటిల్లో గరిష్ఠ భాగం మొబైల్‌ చెల్లింపులే అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా సంస్థలు తమ ఎదుగుదలకు అవసరమైన అదనపు నిధులపై దృష్టి పెట్టాయి.

ఇప్పటికే డిజిటల్ మార్కెట్లో దూసుకెళుతున్న పేటీఎం కూడా అదనపు నిధులతో ప్రత్యర్థులను ఎదుర్కొవడానికి సిద్ధమవుతోంది. సంస్థ విలువను 18 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తూ 2 బిలియన్‌ డాలర్లను సేకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. యాంట్‌ ఫైనాన్షియల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి నిధులను సేకరించనుంది. 

ఈ నిధులతో ఫోన్‌పే, గూగుల్‌ పేతో పోటీపడేందుకు పేటీఎం అవసరమైన హంగులు సమకూర్చుకోనుంది. మరోపక్క ఇప్పటికే అమెజాన్‌ కూడా 2.3 బిలియన్‌ డాలర్లను తన డిజిటల్‌ వాలెట్‌ అభివృద్ధికి సమకూర్చింది. ఇక ఫోన్‌పే కూడా దాదాపు బిలియన్‌ డాలర్లను సమకూర్చుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది. 

దీనిలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఫోన్‌పేను వేరు చేయడానికి బోర్డు ఇప్పటికే అమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఇది పూర్తయితే నిధుల సేకరణ ఫోన్‌పేకు సులువుగా మారుతుంది. దీంతో భవిష్యత్‌లో డిజిటల్‌ చెల్లింపు సంస్థల మధ్య పోటీ తారాస్థాయికి చేరనుందని తెలుస్తోంది.

గూగుల్‌ పే వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారు. 2018 మార్చి నాటికి 14 మిలియన్ల మంది ఉండగా.. ఇప్పుడు 45 మిలియన్లకు చేరుకొంది. గూగుల్‌ పే నుంచి చెల్లింపులు విలువ 81 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

దీంతో గూగుల్‌ కూడా ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. కొత్తగా పైన్‌ ల్యాబ్స్‌, ఇన్నోవైట్‌ పేమెంట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని పీవోఎస్‌ టర్మినల్స్‌ ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేలా గూగుల్ పే ఒప్పందం చేసుకొంది. దీంతో 3,500 పట్టణాల్లో దాదాపు రెండు లక్షల దుకాణాల్లో గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

‘ఇప్పటికే చాలా మంది వినియోగదారులు దుకాణాలకు వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. మేము చాలా దుకాణాలను మా యాప్‌ ద్వారా అందుబాటులోకి తెస్తాం’ అని గూగుల్‌ ప్రతినిధి సజిత్‌ శివానందన్‌ తెలిపారు. దీనిలో భాగంగా రిలయన్స్‌, విశాల్‌ మెగామార్ట్‌ వంటి సంస్థలను తొలుత దీనిలో అందుబాటు లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 

తాజాగా గూగుల్‌ సంస్థ సృజనాత్మకంగా మరో కొత్త ఫీచర్‌ను తన 'గూగుల్‌ పే'కు అనుసంధానించింది. ఈ ఫీచర్‌తో అత్యంత తేలిగ్గా కొనుగోళ్లు చేయవచ్చు. మనం ఏదైనా దుకాణానికి వెళ్లి వస్తువులు కొనుగోలు చేశాక బిల్లు చెల్లించేటప్పుడు సదరు దుకాణ యజమాని మన ఫోన్‌ నంబర్‌ను తన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) టర్మినల్స్‌లో నమోదు చేస్తే చెల్లింపునకు అభ్యర్థన వస్తుంది. 

ఈ సరికొత్త ఫీచర్‌తో గూగుల్‌.. ఫోన్‌పే, పేటీఎంలతో తలపడనుంది. దీంతోపాటు అమెజాన్‌ను కూడా సవాలు చేయనుంది. ఇప్పటికే గూగుల్‌ మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు బంగారం కొనుగోళ్లు, రైలు టికెట్ల బుకింగ్‌ చేసుకోవచ్చు. 

ఈ విషయంపై గూగుల్‌ పే ఇండియా ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ అంబరీష్‌ కెన్‌గే మాట్లాడుతూ 'డిజిటల్‌ చెల్లింపులు భారత్‌కు అద్భుతమైన కథ. మేము మా మనసుకు దగ్గరగా ఉన్న వారి కోసం మార్పులు చేస్తాం' అని పేర్కొన్నారు. 

దేశంలో యూపీఐ చెల్లింపులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇవి డిజిటల్‌ చెల్లింపు రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గంగా మారుతున్నాయి. కేవలం 18నెలల్లోనే ఇవి 40 రెట్లు పెరిగాయి. అంటే 2017 ఆగస్టులో 17 మిలియన్ల చెల్లింపులు జరగ్గా.. అది 2019 ఫిబ్రవరి నాటికి 673 మిలియన్లకు చేరింది.