ఐటీ రంగ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్‌ సంస్థ వ్యయనియంత్రణపై కేంద్రీకరించింది. పొదుపు చర్యల్లో భాగంగా మరింత మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ తన చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా దారుణంగా వార్షిక వృద్ధి అంచనాలను వెల్లడించింది.

దీనికి తోడు కంపెనీ నుంచి డిజిటల్‌ బిజినెస్‌హెడ్‌ గజెన్‌ కందియా బయటకు వెళ్లిపోయారు. దీంతో కంపెనీ మనుగడ కాపాడుకొనేందుకు కాగ్నిజెంట్ యాజమాన్యం ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టినట్టుగా సమాచారం. 

'కంపెనీని పునర్‌ నిర్మించే క్రమంలో యాజమాన్య బృందం పలు వ్యూహాలను పరిశీలిస్తోంది. సంస్థలో అదనంగా ఉన్న మరికొంత ఉద్యోగులను విభజించి వారిపై తదుపరి చర్యలను ప్రకటించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు, ఎలా అనే దానిపై యాజమాన్యం తుది నిర్ణయం తీసుకొంటుంది' అని కాగ్నిజెంట్‌ తెలిపింది.

గత రెండేళ్లలో కాగ్నిజెంట్‌ ప్రధాన కార్యాలయంలో దాదాపు 200 మంది సీనియర్‌ ఉద్యోగులను తొలగించారు. దీనిపై కంపెనీ సీఎఫ్‌వో కరెన్‌ మెక్‌లాఫ్లిన్‌ మాట్లాడుతూ ''మా కంపెనీ భవిష్యత్ అంచనాలు తగినట్లు ఖర్చులను తీసుకొస్తాము. అదే సమయంలో మా పెట్టుబడులు, ప్రతిభను, సృజనాత్మకత ఎంపికలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళాతాం' అని అన్నారు.