న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికం దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’.. టెక్ దిగ్గజం ‘గూగుల్’తో జత కట్టింది. ఎందుకంటారా?!! దేశవ్యాప్తంగా ‘వై-ఫై’ సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. 

దీంతో భారతీయులంతా బీఎస్ఎన్ఎల్ సాయంతో ఉచితంగా ‘వై-ఫై’ సేవలు అంది పుచ్చుకునే అవకాశం లభించింది. గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ ఇన్షియేటివ్ వల్ల ‘వై-ఫై’ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు పొందొచ్చునని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటివరకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థల సేవలో మునిగి తేలిన కేంద్ర ప్రభుత్వానికి తమ ‘డిజిటల్ ఇండియా’ ఇన్షియేటివ్ అంశం హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ‘డిజిటల్ ఇండియా’ఇన్షియేటివ్‌ లక్ష్యాలను చేరుకునేందుకు వివిధ సంస్థల భాగస్వామ్యంతో కలిసి పని చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (సీఎఫ్ఎ) వివేక్ బన్సాల్ తెలిపారు. తద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలన్న డిమాండ్ చేరుకోగలమన్నారు. 

బీఎస్ఎన్ఎల్ - గూగుల్ సంస్థతో కలిసి ఫ్రీ ‘వై-ఫై’ సర్వీసుల కార్యక్రమాన్ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 38 వేల ‘వై-ఫై’ హాట్ స్పాట్ కేంద్రాలు ఉన్నాయి. రూ.19 ఓచర్లను కొనుగోలు చేస్తే ‘వై-ఫై’ సేవలు అందుబాటులోకి వస్తాయి.