ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌)ను గాడిన పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. నష్టాలతో కునారిల్లుతున్న బీఎస్ఎన్‌ఎల్‌ను పట్టాలెక్కించే బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు అప్పగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.

ఇందులో భాగంగా సంస్థను పునరుద్దరణ బాట పట్టించేందుకు అమిత్‌ షా నేతృత్వంలో కేంద్రం ప్రత్యేక మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందానికి హోం మంత్రి షా నేతృత్వం వహిస్తుండగా టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభ్యులు.

మంత్రుల బృందం మంగళవారం భేటీ అయిన బీఎస్ఎన్‌ఎల్‌, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)ను గట్టేక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఇరు సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)ను ఆఫర్‌ చేయటం, 4జీ కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ భూములను విక్రయించటం, వీఆర్‌ఎస్ ప్రతిపాదనకు అంగీకరించిన ఉద్యోగుల కోసం ప్యాకేజీని అందించేందుకు భవనాలను విక్రయం వంటి అంశాలను జీవోఎం పరిశీలించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలు 2016 నుంచి 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి.
 
నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీఎస్ఎన్‌ఎల్‌ను సత్వరమే ఆదుకునేందుకు మంత్రుల బృందం రూ.1,000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బడ్జెటరీ కేటాయింపులకు త్వరలో మంత్రుల బృందం ఆమోదం తెలపనుందని సమాచారం. 

బీఎస్ఎన్ఎల్ సంస్థను గాడిలో పెట్టేందుకు ఈ కేటాయింపులు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్‌లో 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 74 వేల మందికి వీఆర్‌ఎస్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 

బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌, మొబైల్‌ టవర్స్‌ విలువ వరుసగా రూ.1.10 లక్షల కోట్లు, రూ.60 వేల కోట్లు, రూ.35 వేల కోట్లుగా ఉన్నాయి. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయాల్లో దాదాపు 60 శాతం వేతనాలకే వెచ్చించాల్సి వస్తోంది.