ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్!
అమెరికా ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజం ఫెస్టివల్స్ సందర్భంగా భారతదేశంలో వినియోగదారులకు పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. పలు రకాల ఉత్పత్తులపై విభిన్న ఆఫర్లు, రాయితీలు లభిస్తాయి.
న్యూఢిల్లీ: అమెరికా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 29న అర్ధ రాత్రి నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభం కానున్నది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి తొలుత సేల్ అందుబాటులోకి రానుంది. అక్టోబరు 4న అర్ధరాత్రితో సేల్ ముగియనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మొబైల్ ఫోన్లు అత్యంత చౌక ధరల్లో లభిస్తాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, మొబైల్ ఫోన్లపై నోకాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై మరింత తగ్గింపు ధరలు లభించనున్నాయి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్, శామ్‌సంగ్, అమెజాన్ బేసిక్స్, ఫోసిల్ బ్రాండ్ల కొత్త ఉత్పత్తులు ఈ సేల్‌లో భాగంగా అందుబాటులోకి వస్తాయి. వన్‌ప్లస్ టీవీ కూడా ఈ సేల్ ద్వారా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.ఎస్బీఐ డెబిట్ కమ్ క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనున్నది.
కొన్ని వస్తువులపై రూ.900 ఫెస్టివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభించనున్నాయి. అంతే కాదు స్టార్టప్‌లు, ఆర్టిస్టుల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్ ఆఫర్లు అందిస్తోంది. 600కి పైగా పలు ఉత్పత్తులను ఆన్ లైన్ మార్కెట్లో అందుబాటులోకి తేనున్నది.బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ కార్డుల పైనా ఆఫర్లు లభిస్తాయి.
దేశంలో అమెజాన్ సేవలను ప్రారంభించి ఆరేళ్లవుతున్న సందర్బంగా వినియోగదారుల సంఖ్యను ప్రస్తుతం 10 కోట్ల నుంచి రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ రాయితీపై వస్తువుల విక్రయానికి ఉంచుతున్నట్లు సంస్థ ఉపాధ్యక్షులు మనీశ్ తివారీ, గోపాల్ పిళ్లై తెలిపారు.
విస్త్రుత శ్రేణిలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ కంప్యూటర్లు, భారీ గ్రుహోపకరణాలు, వంటింటి సరుకులు, ఫ్యాషన్ వస్తువులు విక్రయిస్తామన్నారు. వినియోగదారులకు సత్వరం దగ్గరయ్యేందుకు అమెజాన్ మూడు భారీ కంటెయినర్ ట్రక్కులను కలిపి ఇంటిలా తయారు చేసిన ‘వీల్స్ ఆన్ హౌన్’ద్వారా 600 వస్తువులను ప్రత్యక్షంగా ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాల్లో, పట్టణాల్లో ప్రదర్శించబోతున్నది.
ఈ ‘వీల్స్ ఆన్ హౌస్’ వాహనం దేశవ్యాప్తంగా 13 నగరాలను చుడుతూ సుమారు ఆరువేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ, మథుర, ఆగ్రా, లక్నో, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్ కతా, విశాఖపట్నం, చెన్నై, కోచిలకు చేరుకుంటుంది.
జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కూడా విక్రయిస్తామని అమెజాన్ తెలిపింది. మొత్తం 20 కోట్లకు పైగా వస్తువులను విక్రయానికి ఉంచుతున్నామని అమెజాన్ ఉపాధ్యక్షులు మనీశ్ తివారీ, గోపాల్ పిళ్లై పేర్కొన్నారు.
అమెజాన్ సంస్థకు వస్తున్న ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకంటే చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయని సంస్థ ఉపాధ్యక్షులు మనీశ్ తివారీ, గోపాల్ పిళ్లై తెలిపారు. దేశంలో దాదాపు 100% పిన్ కోడ్ చిరునామాలకు వస్తువులు సరఫరా చేస్తున్నామన్నారు.
లేహ్ మొదలు లడఖ్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల వరకు ప్రతి వినియోగదారుడి ఇంటి ముందుకే వస్తువులు చేరవేస్తున్నామని మనీశ్ తివారీ చెప్పారు. అమెజాన్ వేదికగా ఐదు లక్షల మంది విక్రయదారులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ సంస్థలకు అమెజాన్ వేదిక మాత్రమేనని, వారే రాయితీలు ఇస్తున్నారని, తాము ఇవ్వడం లేదన్నారు.
మౌలిక వసతుల పరంగా అమెజాన్ సంస్థకు తెలంగాణ అతిపెద్ద రాష్ట్రం అని సంస్థ ఉపాధ్యక్షులు మనీశ్ తివారీ, గోపాల్ పిళ్లై తెలిపారు. వ్యాపార రీత్యా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అమెజాన్ సంస్థకు చాలా ప్రధానమైనవని పేర్కొన్నారు.
ఇలా ఫ్లిప్ కార్ట్ పోటీ
ఫెస్టివల్స్ సందర్బంగా మరో రిటైల్ ఈ-కామర్స్ సంస్థ వాల్ మార్ట్ అనుబంధ ఫ్లిప్ కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఈ నెల 29వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. అక్టోబర్ నాలుగో తేదీన ఈ సేల్ ముగియనున్నది. వినియోగదారులను ఆకర్షించడానికి ‘అమెజాన్’ సంస్థ కంటే ముందే ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. దీంతో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలైన ‘అమెజాన్’, ‘ఫ్లిప్ కార్ట్’ మధ్య గట్టి పోటీ ఉండనున్నది.