Asianet News TeluguAsianet News Telugu

అమ్మ బాబోయ్ కుర్రాళ్లు.. ఇంటర్నెట్ ఏలేస్తున్నారు

పిల్లలు కాదు పిడుగులని భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ) నిగ్గు తేల్చింది. భారత దేశ ఇంటర్నెట్‌ యూజర్లలో 15 శాతం మంది చిన్నారులేనని ఈ సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. అంటే రమారమీ 6.6 కోట్ల మంది 11 ఏళ్లలోపు బాలలు ఇంటర్నెట్ చూస్తున్నారన్న మాట.
 

66 mn children aged 5-11 years are active Internet users in India
Author
Hyderabad, First Published Sep 27, 2019, 1:50 PM IST

న్యూఢిల్లీ: డాడీ.. ఓసారి ఫోన్ ఇవ్వవా! ప్లీజ్ అని అడగని పిల్లలు ఇప్పుడు లేరు. ప్రతి ఇంటిలో కనీసం ఒక్క స్మార్ట్ ఫోన్ అయినా ఉంటుంది. ఇంతకుముందు టచ్ స్క్రీన్ ఫోన్లలో లోడ్ చేసిన కార్యక్రమాలు చూసేవారు.. కానీ డేటా అందుబాటులోకి వచ్చాక ఈ స్మార్ట్ ఫోన్లలో పిల్లలు గేమ్స్ ఆడటానికే పరిమితం కావట్లేదు. ఇంటర్నెట్ కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. 

రోజువారీగా పుస్తకాలను చదవడంలో వెనుకబడ్డా ఆశ్చర్యం లేదు గానీ యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి యాప్‌లు పెద్దలకంటే తేలిగ్గా ఓపెన్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారు 100 మంది ఉంటే వారిలో 15 మంది పిల్లలే మరి. అదీ 5-11 సంవత్సరాల మధ్యవయస్కులైన పిల్లలేనట. సంఖ్యాపరంగా చూస్తే 6.6 కోట్లన్న మాట. 

మొబైల్‌లో కార్టూన్‌ చిత్రాలు, యూట్యూబ్‌లో రైమ్స్‌ చూస్తూ కాలం గడిపే పిల్లలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏడాది నిండిన బాలలు కూడా కార్టూన్‌ చిత్రాలు చూడనీయకపోతే మారాం చేయడం నిత్యం కనిపించే దృశ్యం మన కళ్ల ముందు కదులుతుంది. 

కానీ దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో ఇలాంటి పిల్లల సంఖ్య తక్కువేమీ కాదని అంటోంది భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ). ఆ సంస్థ ‘ఇండియా ఇంటర్నెట్‌- 2019’ పేరిట విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 15 శాతం మంది పిల్లలు తమ కుటుంబ సభ్యుల డివైస్‌లను ఉపయోగించుకుని ఇంటర్నెట్‌ చూస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. 

ఇంటర్నెట్‌ వినియోగంలో మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్నదని, అయినా ఇప్పటికీ మొత్తం జనాభాలో 36 శాతం మందికే అది అందుబాటులో ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ఇంటర్నెట్‌ విస్తరణకు దేశంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపింది.
 
దేశంలో ప్రతి నెలా యాక్టివ్‌గా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య ఈ ఏడాది మార్చి చివరి నాటికి 45.1 కోట్లు కాగా, వారిలో 12 ఏళ్లు పైబడిన వారు 38.5 కోట్లు. 12-29 ఏళ్ల మధ్య వయస్కులు 12.83 కోట్ల మంది ఉన్నారు. 

11 ఏళ్లలోపు వారు 6.6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కాగా, పట్టణ ప్రాంతాల వినియోగదారులు 19.2 శాతం. గ్రామీణ ప్రాంతాలు కూడా ఇంటర్నెట్‌ వినియోగంలో పట్టణాలతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి.

ప్రాంతాల వారీగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గరిష్ఠ స్థాయిలో ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది. కేరళ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 1.17 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారులతో ముంబై అగ్రగామిగా ఉండగా 1.12 కోట్లతో ఢిల్లీ తర్వాత స్థానంలో ఉంది. 

61 కోట్ల మంది వినియోగదారులతో బెంగళూరు, కోల్‌కతా మూడో స్థానాన్ని పంచుకున్నాయి. నాలుగో స్థానంలో చెన్నై ఉంది. పట్టణ వినియోగదారుల్లో 72 శాతం అంటే 13.9 కోట్ల  మంది, గ్రామీణ వినియోగదారుల్లో 57 శాతం 10.9 కోట్ల మంది ప్రతి రోజూ ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. 

పట్టణ ప్రాంతాల్లో మూడింట ఒక వంతు మంది రోజూ గంటకు పైగా ఇంటర్నెట్‌ వినియోగిస్తుంగా గ్రామీణ ప్రాంతాల్లో అదే సంఖ్యలో వినియోగదారులు 15 నుంచి 30 నిమిషాల పాటు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు

ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో పురుషుల సంఖ్య 25.8 కోట్లు. మహిళా యూజర్లు వారిలో సగం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువ ఉంది. మహిళా ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో కేరళ, తమిళనాడు, ఢిల్లీ అధిక వాటా కలిగి ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios