Asianet News TeluguAsianet News Telugu

Kavach System: కవాచ్ వ్యవస్థ అంటే ఏమిటి ? అది రైలు ప్రమాదాలను ఎలా నివారిస్తుంది?

Kavach System: ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది మరణించిన తర్వాత భారతీయ రైల్వే యొక్క ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవాచ్' గురించి చర్చలు జరుగుతున్నాయి. కవాచ్ అంటే ఏమిటి?  అది భయంకరమైన ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడగలదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

What is the Kavach system and could it have helped avert  train accident KRJ
Author
First Published Jun 3, 2023, 10:59 PM IST

Kavach System: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదంతో  రైల్వే సాంకేతికతపై , రైల్వే మంత్రిత్వ శాఖ తీరుపై కూడా మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి రైలు ప్రమాదాలను నిలువరించే వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ కొద్ది నెలల క్రితమే చెప్పింది. ఈ వ్యవస్థను కవాచ్ సిస్టమ్ అంటారు. దీని పూర్తి పేరు ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. బాలాసోర్ ప్రమాదం తర్వాత.. ఈ వ్యవస్థపై సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు వెలిశాయి. ఈ రైళ్లలో పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే.. ఈ ప్రమాదం అస్సలు జరిగేది కాదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

కవాచ్ వ్యవస్థ ఏమిటి?

కవాచ్ అనేది భారతీయ రైల్వేస్ యొక్క ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ సిస్టమ్. దీని ద్వారా రైలు ప్రమాదాలను నివారించడానికి వీలు ఉంటుంది. వాస్తవానికి.. కవాచ్ అనేది లోకోమోటివ్‌లో ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరం. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పని చేసే ప్రత్యేక వ్యవస్థ. ఇది రైల్వే సిగ్నల్ సిస్టమ్‌తో పాటు ట్రాక్‌లపై నడుస్తున్న రైళ్ల వేగాన్ని నియంత్రిస్తుంది. దీని ద్వారా రైలు ప్రమాదాలకు అరికట్టవచ్చని చెబుతున్నారు. కోరమాండల్ రైలు ప్రమాదానికి సంబంధించి ఈ రైలులో పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అదేంటంటే.. ఈ సిస్టం ఈ రైల్లో అమర్చి ఉంటే బహుశా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు.

కవాచ్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

కవాచ్ అనేది ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లో వ్యవస్థాపించబడిన వ్యవస్థ. ఇందులో రైలు, ట్రాక్, రైల్వే సిగ్నల్ సిస్టమ్‌ అన్ని అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తుంది.  

స్పష్టంగా చెప్పాలంటే.. లోకో పైలట్ ఏ కారణం చేతనైనా రైల్వే సిగ్నల్‌ను జంప్ చేసినప్పుడు ఈ కవచ వ్యవస్థ ఆటోమిటిక్ గా యాక్టివేట్ అవుతుంది. తర్వాత కవాచ్ సిస్టమ్ లోకో పైలట్‌ను హెచ్చరిస్తుంది. రైలు బ్రేక్‌లను నియంత్రించడం ప్రారంభిస్తుంది. దీంతో పాటు అదే ట్రాక్‌పై మరో రైలు కూడా వస్తున్నట్లు కవాచ్ సిస్టమ్‌కు తెలిస్తే.. అది అవతలి రైలుకు హెచ్చరికను పంపుతుంది. ఇతర రైలు కొంత దూరం వచ్చి స్వయంగా ఆగుతుంది.

ఇప్పటి వరకు ఎన్ని రైళ్లలో కవాచ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు?

23 డిసెంబర్ 2022 న రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ  రాబోయే కాలంలో దశలవారీగా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలోని 1445 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివరకు 77 రైళ్లకు కవాచ్ సిస్టమ్ జోడించబడింది. దీంతోపాటు ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్‌లో కూడా దీన్ని అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
ఒడిషా ప్రమాదాన్ని నివారించడంలో కవాచ్ సహాయం పడుతుండేనా..? 

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత కవాచ్ చర్చనీయాంశంగా మారింది. కవాచ్‌ను ఏర్పాటు చేసి ఉంటే.. ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రమాద స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో యాంటీ-కొల్లిషన్ సిస్టమ్‌( కవాచ్)ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనను ఎదుర్కొన్న రైళ్లు కవాచ్‌తో నడిచేవి కావని రైల్వే అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. అయినప్పటికీ.. కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల విషాదాన్ని నివారించవచ్చా అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి.

ప్రోబ్ రిపోర్ట్ ఏమి సూచిస్తుంది?

శుక్రవారం జరిగిన ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు -- బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ , ఒక గూడ్స్ రైలు ఉన్నాయి. ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇవ్వడానికి గూడ్స్ రైలును లూప్ లైన్‌లో ఉంచి ఉండవచ్చు అని తెలుస్తోంది. గూడ్స్ రైలు వేచి ఉన్నందున, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాన లైన్ గుండా వెళ్ళడానికి సిగ్నల్ ఇవ్వబడింది. కానీ పట్టాలు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు నిలిపి ఉంచిన లూప్ లైన్‌కు దారితీసింది.

అది గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దాని ప్రభావం కారణంగా కొన్ని కోచ్‌లు బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న ట్రాక్ పైకి పడ్డాయి. అదే సమయంలో  బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిమీ వేగంతో ప్రయాణిస్తుండగా.. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 116 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు పిటిఐ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక విచారణ నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios