Women Reservation Bill: గీతా ముఖర్జీ.. 27 ఏళ్ల క్రితమే మహిళా రిజర్వేషన్‌కు బీజం వేసిన యోధురాలు..
Women Reservation Bill: పార్లమెంటరీ, శాసనసభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గీతా ముఖర్జీ (Geeta Mukherjee) సెప్టెంబర్ 1996లో పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంటు, శాసన సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తప్ప సాధికారత సాధించలేమని గీతా ముఖర్జీ బలంగా విశ్వసించారు.

Women Reservation Bill: దాదాపు మూడు దశాబ్దాలుగా నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతివ్వడం విశేషం. ఈ మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. అయితే.. ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో మహిళ బిల్లుకు మూలకారకురాలు గీతా ముఖర్జీ, గీతా దీదీ.. అంటూ.. ఓ పేరు ప్రముఖంగా ప్రతిధ్వనించింది. ఇంతకీ గీతా ముఖర్జీ(Geeta Mukherjee) ఎవరు? ఆమె మహిళ రిజర్వేషన్ కోసం ఏం చేసింది? అనేది తెలుసుకుందాం..
- మహిళ రిజర్వేషన్ బిల్లును తొలిసారి సెప్టెంబర్ 12, 1996న CPI నాయకురాలు, ఎంపీ గీతా ముఖర్జీ (Geeta Mukherjee) పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ఆమె జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు.. పలు సమగ్ర సమీక్ష నిర్వహించి, ఏడు సిఫార్సులు చేశారు. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.
- గీతా ముఖర్జీ 1924లో కలకత్తాలో జన్మించారు. 1940ల ప్రారంభంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న జెస్సోర్‌లో విద్యార్థి నాయకురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె 1942లో ప్రముఖ CPI నాయకుడు బిస్వనాథ్ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. 1946లో బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆమె బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కార్మికుల తిరుగుబాటులో చురుకుగా పాల్గొని అరెస్టు చేయబడింది. ఈ తరుణంలో (1948లో) ఆమె ఆరు నెలలపాటు నిర్బంధించబడ్డారు.
- అనంతరం గీతా ముఖర్జీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఆమె 1967లో ఎమ్మెల్యేగా ఎన్నికై.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తొలిసారి అడుగుపెట్టారు. 1977 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరంలో 1980లో జరిగిన లోక్‌సభ పోటీ చేసి.. ఎంపీగా ఎన్నికయ్యారు.ఆమె మరణించే వరకు పన్స్కురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె CPI జాతీయ కౌన్సిల్, జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా సేవలందించారు.
- అలాగే.. గీతాముఖర్జీ వివిధ పార్లమెంటరీ కమిటీలు, మహిళలకు సంబంధించిన వివిధ బిల్లులపై జాయింట్ సెలెక్ట్ కమిటీలో పనిచేశారు. ఆమె మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆమె ఎంతగానో పోరాడారు.
- గీతా ముఖర్జీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినా తనకు సాహిత్యం మీద ఉన్న మగువను వీడలేదు. ఆమె బెంగాలీలో 'భారత్ ఉపకథ', 'ఛోటోడర్ రవీంద్రనాథ్', 'హే అతిత్ కథా కావో', 'నేకెడ్ అమాంగ్ వోల్వ్స్' వంటి ఎన్నో పుస్తకాలను రచించారు.
- శ్రీమతి గీతా ముఖర్జీ 2000లో 76 యేట గుండెపోటుతో మరణించారు. ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లుకు కోసం పోరాడిన ఆమె.. ప్రభుత్వం దానిని ఆమోదించడంలో విఫలమయ్యాయని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చివరి రోజుల్లో కూడా మహిళ బిల్లు ఆమోదం కోసం ఎంతగానో పోరాడారు.