ఉమ్మడి పౌరసత్వానికి మద్దతు తెలిపిన ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం.. ‘బహుభార్యత్వాన్ని నిషేధించాలి’
ఆర్ఎస్ఎస్ ముస్లిం మహిళల విభాగం ప్రతినిధుల బృందం లా కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రితురాజ్ అవస్తీని కలిసింది. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కోసం కొన్ని ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా బహుభార్యత్వాన్ని నిషేధించాలని, బాల్య వివాహాలపై నిషేధం, ఆస్తి విషయంలోనూ సమాన హక్కులు ఉండాలనే ప్రతిపాదనలు చేసింది.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళా విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) మహిళా సభ్యులు బహుభార్యత్వాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల పెళ్లికి కనిష్ట వయసును నిర్దేశించాలని అన్నారు. వీటితోపాటు ఉమ్మడి పౌరసత్వ ముసాయిదా బిల్లుకు ఇంకొన్ని ప్రతిపాదనలను పేర్కొంటూ ఎంఆర్ఎం ప్రతినిధుల బృందం నేషనల్ లా కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రితురాజ్ అవస్తీని కలిసింది. ముస్లిం రాష్ట్రీయ మంచ్ మహిళా విభాగం హెడ్ షాలినీ అలీ సారథ్యంలో 20 మంది మహిళల బృందం జస్టిస్ అవస్తీని ఆయన కార్యాలయంలో కలిసింది. దేశంలో ఉమ్మడి పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని సమర్థించింది.
పెళ్లి నమోదును ఆధార్ కార్డు లింక్ చేసి చేయాలని, తద్వార బహుభార్యత్వాన్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని షాలినీ అలీ కమిషన్‌కు చెప్పింది. నిఖానామా మోడల్‌ను కూడా కమిషన్‌కు వివరించింది. జహీరా బేగం, బబ్లీ పర్వీన్, షామా ఖాన్, అన్వర్ జహాన్, ప్రొఫెసర్ షాదాబ్ తబస్సుం, ప్రొఫెసర్ షెరీన్, డాక్టర్ షహీన్ జాఫ్రీ, ప్రొఫెసర్ సోనూ భాటియాలు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు.
జస్టిస్ అవస్తీ ఈ ప్రతినిధుల బృందంతో మాట్లాడారు. యూసీసీ డ్రాఫ్ట్ గురించి చాలా గందరగోళం నెలకొని ఉన్నదని వివరించారు. కానీ, ప్రజలు దీని గురించి బాధపడవద్దని చెప్పారు. ఈ బిల్లు ద్వారా దేశ ప్రజలను మతాలకు అతీతంగా సాధికారులను చేస్తుందని యూసీసీ సమావేశంలో తేలిందని వివరించారు. ఎంఆర్ఎం ప్రతినిధి షాహిద్ సయీద్ మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు ప్రతినిధుల బృందాలు అవస్తీని కలిశాయని వివరించారు. లా కమిషన్ ముందు తమ ప్రతినిధుల బృందం ఈ కింద అంశాలను లేవనెత్తిందని తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న సమాజంలో లింగ సమానత్వం చాలా ముఖ్యం అని తమ బృందం పేర్కొంది. సమాజంలో మహిళ, పురుషులు ముఖ్యమైన పునాదులను, వీరి మధ్య కృత్రిమంగా అసమానతను తీసుకువచ్చారని, తద్వారా పురుషాధిపత్యానికి ఆస్కారం ఏర్పడిందని తెలిపింది. కాబట్టి, లింగ సమానత్వం దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంఆర్ఎం మెమోరాండం ఇచ్చింది.
Also Read: భార్యకు జాబిల్లిని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. చంద్రుడిపై ఎకరం కొన్నట్టు వెల్లడి.. అసలేం జరిగింది?
బాల్య వివాహాల సాంప్రదాయాన్ని పూర్తిగా నిర్మూలించాలి. అన్ని మతాల్లోనూ వివాహానికి కనిష్ట వయసును నిర్ణయించాలి. చాలా ప్రాంతాల్లో 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడ పిల్లలకు పెళ్లి చేస్తున్నారని, ఇది వారిని భౌతికంగా, మానసికంగా ఎదగకుండా అడ్డుకుంటున్నదని వివరించారు. అంతేకాదు, ఆ మహిళలు ఆర్థిక స్వతంత్రత సాధించే అవకాశాలే లేకుండా పోతున్నాయని తెలిపారు.
తల్లి, తండ్రి ఇరువురికి దత్తత తీసుకునే హక్కులు ఇవ్వాలని ఎంఆర్ఎం బృందం డిమాండ్ చేసింది. ప్రస్తుతం ముస్లిం, క్రైస్తవులు, పార్శీలు దత్తత చట్టం పరిధిలోకి రారు. పిల్లలను దత్తత తీసుకునే చట్టం అందరికీ అందుబాటులో ఉండే చట్టంగా ఉండాలని తెలిపారు.
భారత్‌లో వలసవాదుల పాలనలో ఉన్నప్పుడు బహుభార్యత్వం అందరికీ నిషేధంగా ఉండేది. కానీ, స్వతంత్ర భారతంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద ఇది కేవలం హిందువులకు మాత్రమే నిషేధంగా ఉన్నదని చెప్పారు. కాబట్టి, అన్ని సముదాయాల్లోనూ బహుభార్యత్వాన్ని నిషేధించాలని ఎంఆర్ఎం బృందం కోరింది. అయినా.. ముస్లింలే కాకుండా ఇతర సమాజాల్లోనూ బహుభార్యత్వ సంప్రదాయం ఉన్నదని వివరించింది.
పెళ్లిళ్లు తమ మతపరమైన విధానాల్లో చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి చేసేలా ఈ చట్టం ఉండాలని కోరారు. విడాకులు కూడా రిజస్టర్ చేయాలని ఈ మహిళా బృందం డిమాండ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఏ మతం వారైనా తప్పుడు సాంప్రదాయాలు అనుసరిస్తే వాటిని నిషేధించాలని వివరించింది.
ఇక చివరగా ప్రతి ఒక్కరికీ ఆస్తి విషయం, వారసత్వ ఆస్తి విషయంలోనూ సమాన హక్కులు ఉండాలని ఎంఆర్ఎం ప్రతినిధులు డిమాండ్ చేశారు.