సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు బ్రేక్ పడింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో జూలై 26 వరకు ఎలాంటి వివరణాత్మక శాస్త్రీయ సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు బ్రేక్ పడింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో జూలై 26 వరకు ఎలాంటి వివరణాత్మక శాస్త్రీయ సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు నిర్వహణ కమిటీకి చెందిన పిటిషనర్లను ఆదేశించింది. ఇక, గతంలో ఉన్న ఆలయంపై మసీదును నిర్మించారో లేదో తెలుసుకోవడానికి ఏఎస్‌ఐ సర్వే కోసం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ మసీదు నిర్వహణ కమిటీకి చెందిన పిటిషనర్లు  సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి  తెలిసిందే. 

ఆ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు అత్యవసర విచారణ చేపట్టింది. అయితే సర్వే నిర్మాణాన్ని ఏ విధంగానూ మార్చదని కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది. ఒక ఇటుక తొలగించబడలేదు లేదా ప్రణాళిక చేయబడలేదని తెలిపింది. సర్వే ప్లాన్‌లో కొలత, ఫోటోగ్రఫీ, రాడార్ అధ్యయనాలు మాత్రమే ఉన్నాయని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో జూలై 26  సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి వివరణాత్మక శాస్త్రీయ సర్వే నిర్వహించవద్దని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు నిర్వహణ కమిటీకి పిటిషనర్లకు తెలిపింది. 

ఇదిలాఉంటే, వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి చెందిన 30 మంది సభ్యుల బృందం సోమవారం ఉదయం  సర్వే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జ్ఞానవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం పైన నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడం వారి లక్ష్యంగా ఈ సర్వే సాగాల్సి ఉంది. ఇక, ఇటీవల వారణాసి జిల్లా జడ్జి ఎకే విశ్వేష్ సర్వేకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో పాటు ఆగస్టు 4వ తేదీలోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఏఎస్‌ఐని ఆదేశించారు.

సందేహాస్పద భవనం  “మూడు గోపురాల క్రింద” సర్వే కోసం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సాంకేతికతను ఉపయోగించాలని, “అవసరమైతే” అక్కడ తవ్వకం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. హిందు ప్రతినిధులు చెబుతున్న ‘వాజూ ఖానా’ సర్వే‌లో భాగంగా ఉండకూడదని తెలిపింది. మసీదు కాంప్లెక్స్‌లోని ఆ ప్రదేశానికి రక్షణ కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.