Manmohan Singh : ఈయన మీ జీవితాలను ఎలా మార్చారో తెలుసా?
ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. తద్వారా దేశం అంతర్జాతీయ స్థాయికి చేరింది. సామాన్యుడిపైనా ఆయన పాలనా ప్రభావం గట్టిగానే వుంది. మన జీవితాలను మన్మోహన్ సింగ్ ఎలా మార్చారో తెలుసుకుందాం.
మన్మోహన్ సింగ్ ... భారతదేశ 14వ ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థపై తనదైన మార్క్ వేసిన ప్రముఖ ఆర్థికవేత్త. దేశ ఫైనాన్స్ మినిస్టర్ గా ఆర్థిక సంస్కరణలే కాదు ప్రధానిగా సామాజిక సంస్కరణలు కూడా చేపట్టారు మన్మోహన్ సింగ్. దూరదృష్టితో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు భారతీయ సమాజంపై చెరగని ముద్ర వేసాయి.
ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ, పరిపాలన పురోగతి సాధించి దేశం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఆయన పదవీకాలం వివాదాస్పదమే అయినప్పటికి... ఆ ప్రభావం సామాన్యులపై పడిందని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరిగినా... అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా... భారతదేశ పురోగతికి ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
విషాదకరంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 డిసెంబర్, 2024న అనారోగ్యంతో కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ఆయన మృతిచెందారు. ఆయన మన మధ్యనుండి వెళ్లిపోయినా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చారు. ఆర్థికవేత్తగా, ఆర్ధికమంత్రి, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతీయుల జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపించాయి. ఇలా మన్మోహన్ సింగ్ సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలను ఎలా మార్చారు? దేశ అభ్యున్నతిలో ఆయన పాత్ర ఏమిటి? ఆయన హయాంలో ఎలాంటి సంస్కరణలు చోటుచేసుకున్నాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
1. ఆర్థిక సంస్కరణలు ... దేశాభివృద్దికి టర్నింగ్ పాయింట్
ఆర్థికవేత్తగా గుర్తింపుపొందిన మన్మోహన్ సింగ్ ను 1991 లో దేశ ఆర్థిక మంత్రిగా నియమించింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయమది. దేశంలో విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి... ద్రవ్యోల్బణం 13% పైగా ఉంది... ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కనిపించిన ఒకే ఆప్షన్ మన్మోహన్ సింగ్... దీంతో ఆనాటి ప్రధాని పివి నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా నియమించారు. పివి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్నేమార్చేసాయి.
కీలక నిర్ణయాలు:
రూపాయి విలువ తగ్గింపు: ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో రూపాయిని పాక్షికంగా మార్చుకోవడానికి అనుమతించడం ఒకటి. ఇది పోటీ మారకపు రేటుకు దారితీసింది... ఎగుమతులను పెంచింది.
లైసెన్స్ రాజ్ కు స్వస్తి: అతను అనేక పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాలను రద్దు చేసారు. దీంతో పారిశ్రామికవేత్తలపై దశాబ్దాలుగా సాగుతున్న బ్యూరోక్రాటిక్ నియంత్రణకు ముగింపు పలికారు. తద్వారా పెట్టుబడులకు తలుపులు తెరిచారు.
వాణిజ్య సరళీకరణ : ఆర్థిక మంత్రిగా వున్నప్పుడే దిగుమతి సుంకాలు భారీగా తగ్గించబడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించి మెరుగైన,నాణ్యత వస్తువులను ప్రజలకు అందించేలా ప్రోత్సహించారు.
ప్రైవేటీకరణ: మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వుండగానే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. ప్రైవేట్ సంస్థల రంగప్రవేశంతో కొత్త ఆవిష్కరణలు పెరిగి ఆయా సంస్థల సామర్థ్యాన్ని పెంచాయి.
విదేశీ పెట్టుబడులు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డిఐ) పరిమితులు సడలించబడ్డాయి. ఇది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి మల్టి నేషనల్(బహుళజాతి) సంస్థలను ఆకర్షించింది.
ప్రభావం:
ఆర్థిక వృద్ధి: భారతదేశం యొక్క GDP(Gross domestic product) వృద్ధి రేటు 1991లో 1.1% వుంటే ఆ తర్వాత సగటున 6%కి పెరిగింది.
ఉపాధి అవకాశాలు: సరళీకృత ఆర్థిక వ్యవస్థ ఐటి, టెలికాం, తయారీ వంటి రంగాలలో వృద్ధిని పెంచింది. లక్షలాది ఉద్యోగాలను సృష్టించింది.
మధ్యతరగతి పెరుగుదల: దేశంలో అనేక మార్పులు సంభవించాయి... ప్రజల ఆదాయం పెరగడంతో పేదరిక తగ్గింది... మద్య తరగతి పెరిగింది. ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు పెరిగాయి.
అంతర్జాతీయ గుర్తింపు: వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కీలక పాత్ర పోషించింది.
2. ప్రధానమంత్రిగా సంస్కరణలు (2004-2014):
ప్రధానమంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ దేశాన్ని అభివృద్ది దిశగా నడిపించారు. దేశ పరిస్థితిని మార్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు... అనేక విధానాలను అమలుచేసారు. ముఖ్యంగా దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అనేక విధానాలను ప్రవేశపెట్టారు.
ముఖ్య విధానాలు:
ఎ) గ్రామీణాభివృద్ధి:
MGNREGA (2005): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల వేతన ఉపాధిని అందించింది. ఇది గ్రామాల్లోని ఉపాధి అందించి పేదరికాన్ని తగ్గించే చర్య...తద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలను తగ్గించింది.
భారత నిర్మాణ కార్యక్రమం: దేశంలో రోడ్లు, నీటిపారుదల, గృహనిర్మాణం, విద్యుద్దీకరణతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది.
బి) విద్య, ఆరోగ్యం:
విద్యా హక్కు (RTE) చట్టం (2009): 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా, ఉచితంగానే విద్యను అందించడం ద్వారా చదువును ప్రాథమిక హక్కుగా మార్చింది.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM): తల్లిబిడ్డల ఆరోగ్యంపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత డెలివరీని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సి) ఆర్థిక, మౌలిక సదుపాయాల వృద్ధి:
గోల్డెన్ క్వాడ్రిలేటిరల్ (చతుర్భుజ) విస్తరణ: ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడం కోసం ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం.
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (JNNURM): పట్టణ మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలపై దృష్టి సారించింది.
డి) సామాజిక సాధికారత:
సమాచార హక్కు చట్టం (2005): ప్రభుత్వ రంగంలో పారదర్శకతను పెంపొందించడం, అవినీతిని తగ్గించడమే సమాచార హక్కు చట్టం లక్ష్యం. తద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి పౌరులకు అధికారం కల్పించారు.
ఆహార భద్రతా చట్టం (2013): భారతదేశ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మందికి సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇ) ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ డిప్లొమసీ:
ఇండియా-యూఎస్ సివిల్ న్యూక్లియర్ ఒప్పందం (2008): భారతదేశం అణు సాంకేతికత, ఇంధనాన్ని పొందేందుకు వీలు కల్పించింది.
ప్రభావం:
గ్రామీణ సాధికారత: MGNREGA, ఇతర గ్రామీణ పథకాలు లక్షలాది మందిని పేదరికం నుండి బయటపడేసాయి. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి.
విద్య, ఆరోగ్యం: అక్షరాస్యత రేట్లు, ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపడ్డాయి. తద్వారా భారతీయుల ఆయుర్దాయం పెరగడం, ప్రసూతి మరణాలు తగ్గడం జరిగింది.
పట్టణ పరివర్తన: మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ పునరుద్ధరణ, ఆధునికీకరించిన నగరాలు, పెట్టుబడిని ఆకర్షించడం, జీవన నాణ్యత మెరుగుపడింది.
ఎనర్జీ వనరుల పెరుగుదల: అణు ఒప్పందం భారతదేశ ఇంధన వనరులను మరింత పెంచింది. దీంతో స్థిరమైన వృద్ధిని సాధించేలా చేసింది.
3. దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలు ...
ఐటీ, టెలికాం రంగాల వృద్ది: బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను గ్లోబల్ టెక్ హబ్‌లుగా మార్చేందుకు, భారతదేశ ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి మన్మోహన్ సింగ్ విధానాలు పునాది వేశాయి. ఇది మిలియన్ల కొద్దీ అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించింది. సాంకేతిక సేవలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది.
పెట్టుబడులు: ఆర్థిక సంస్కరణలు దేశంలో పారిశ్రామిక సంస్కృతిని ప్రోత్సహించింది...దీంతో ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో వంటి సంస్థలు వచ్చాయి. ఇలా దేశంలో ఆర్థికంగానే కాదు సామాజికంగానూ పెను మార్పులు వచ్చాయి.
ప్రజాస్వామ్యం బలోపేతం:
RTI (Right to Information Act) చట్టం: పాలనలో పారదర్శకతను దేశ ప్రజలు కోరవచ్చు. ఇది ప్రభుత్వం మరింత జవాబుదారీ పాలించేందుకు దారి తీస్తుంది.
సమ్మిళిత వృద్ధి: ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి వంటి కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు వృద్ధి ప్రయోజనాలు చేరేలా చేశాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన :
తెలంగాణ ప్రజలు చిరకాల ఆంకాంక్షను గుర్తించిన ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించింది. ఇలా మన్మోహన్ ప్రధానిగా వుండగానే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. అయితే కాలక్రమేణా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిలో దూసుకుపోతున్నాయి. ఇలా తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది మన్మోహన్ సింగ్ హయాంలోనే కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయనను చిరకాలం గుర్తుంచుకుంటారు.
ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు తీరని నష్టం జరిగింది. ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కానీ తెలంగాణలో మాత్రం ఉనికిని చాటుకున్న కాంగ్రెస్ పదేళ్లతర్వాత అధికారంలోకి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ప్రధానిగా మన్మోహన్ సింగ్ తెలుగు రాష్ట్రాన్ని విభజించడం ఓవైపు తీపి, మరోవైపు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు.
మన్మోహన్ సింగ్ పాలనను మసకబార్చిన అవినీతి కుంభకోణాలు
ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీకాలంలో (2004–2014) గణనీయమైన ఆర్థిక, సామాజిక సంస్కరణలు జరిగాయి. కానీ ఇవన్ని దేశ ప్రజలకు గుర్తులేకుండా పోయాయి. ఆయన హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలు ఆయన చేసిన అభివృద్దిని కనిపించకుండాచేసాయి. ఇందులో ప్రధానమైనది 2G స్పెక్ట్రమ్ స్కామ్... టెలికాం లైసెన్సుల జారీలో జరిగిన అవినీతి ఆనాడు పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది.
ఇక మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన మరో పెద్ద కుంభకోణం బొగ్గు గనుల కేటాయింపు... ఇందులోనూ భారీ స్కామ్ జరిగింది. బిడ్డింగ్ ప్రక్రియ పారదర్శకంగా లేకుండా బొగ్గు బ్లాకులను కేటాయించారు. కంప్ట్రోలర్ ఇండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక ప్రకారం ఈ బొగ్గు కుంభకోణంలో ప్రభుత్వానికి రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారాలు మన్మోహన్ సింగ్ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత లేవనే విమర్శలకు దారితీసాయి.
మన్మోహన్ సింగ్ కు వ్యక్తిగతంగా పాలనపై చిత్తశుద్ది వున్నవాడని, నిజాయితీపరుడని పేరుంది. కానీ ఆయన ప్రధానిగా విఫలమయ్యాడని... అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని విమర్శకులు వాదిస్తారు. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు కూడా మన్మోహన్ ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. సంకీర్ణ రాజకీయాలు, మిత్రపక్షాల ఒత్తిడి కారణంగా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయలేక ఆయన మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వివాదాలు ఆయన పరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతిని అధికారం కోల్పోవడానికి దారితీసాయి. ఆర్థికవేత్తగా, సంస్కర్తగా అతని వారసత్వం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ ఈ కుంభకోణాలు ప్రధానిగా ఆయన ఖ్యాతిని మసకబర్చాయి.
ముగింపు
డాక్టర్ మన్మోహన్ సింగ్ సామాన్య జీవితం, ప్రవర్తన నేటి రాజకీయ నాయకులకు స్పూర్తిదాయకం. ఆయన ఆర్థిక సంస్కరణలు దేశంలో పెట్టుబడులు పెంచి వ్యాపారాభివృద్దికి దోహదం చేసాయి. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి భారతీయులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాయి. ప్రధానమంత్రిగా ఆయన విధానాలు పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ అందించాయి.
ఆయన జీవితం వినయం, తెలివి, పట్టుదలకు ఒక పాఠం. ఆయన నాయకత్వంలో భారతదేశం పరివర్తన చెందడాన్ని చూసిన భారతీయులకు మన్మోహన్ సింగ్ చిరస్థాయిగా గుర్తిండిపోతారు.