unemployment: పెరిగిన నిరుద్యోగం.. కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఉపాధి పై దెబ్బ‌.. !

unemployment: క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత నిరుద్యోగం రేటు పెరిగింద‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. 2021-జూన్ లో కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్న ప్ర‌భుత్వ నివేదిక‌లు.. 2020తో పోలిస్తే మెరుగవుతున్న ఉపాధి పరిస్థితి మళ్లీ దిగజారిందని స్ప‌ష్టం చేస్తున్నాయి.

In 2021, Indias urban unemployment rose to 12.6% during April-June from 9.3% in January-March

unemployment: భారతదేశంలో పట్టణ నిరుద్యోగం 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 9.3% నుండి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 12.6%కి పెరిగిందని ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయం (National Statistical Office) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. మార్చి 14న నివేదిక విడుదలైంది. క‌రోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాలను చవిచూసింది. గత ఏడాది దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ సమయంలో నిరుద్యోగిత రేటు రెండంకెలకు చేరుకుంది. 2021లో వ‌చ్చిన క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత  జూన్ లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిందని జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (Periodic Labour Force Survey) నివేదిక పేర్కొంది. దీని కార‌ణంగా మెరుగుప‌డుతున్న ఉపాధి పరిస్థితులు మ‌ల్లీ దిగ‌జారాయి. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు ఒక సంవత్సరం క్రితం కంటే తక్కువగా ఉంది, కానీ అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. 

ఏప్రిల్-మే మధ్యకాలంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 12.6 శాతానికి పెరిగింది. జనవరి-మార్చిలో ప‌ట్ట‌ణ నిరుద్యోగ రేటు 9.3 శాతంగా ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఉద్యోగాల‌తో పాటు ఉపాధికి దూర‌మ‌వుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరిగింది. 

దిగజారుతున్న పరిస్థితి..

నిరుద్యోగం పురుషుల కంటే మహిళల్లోనే పెద్ద సమస్యగా గుర్తించబడింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికంలో ఉద్యోగంలో మహిళల వాటా 20.1 శాతానికి తగ్గింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 21.2 శాతంగా ఉంది. ఈ సమయంలో, మొత్తం కార్మిక శక్తి భాగస్వామ్యం (LFPR) కూడా జనవరి-మార్చి 2021లో 47.5 శాతం నుండి 46.8 శాతానికి తగ్గింది. LFPR అనేది పని చేస్తున్న లేదా పని కోసం హాజరైన వ్యక్తుల మొత్తం జనాభాను సూచిస్తుంది.

స్వయం ఉపాధిలో పెరుగుదల

జనవరి-మార్చి త్రైమాసికంలో 9.4 శాతంగా ఉన్న అన్ని వయసుల వారి నిరుద్యోగిత రేటు ఏప్రిల్-జూన్ 2021లో 12.7 శాతానికి పెరిగింది. ఈ కాలంలో నిరుద్యోగిత రేటు రెండంకెలకు చేరుకున్నప్పటికీ, ఇది క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కంటే ఉంది. మహమ్మారి మొదటి వేవ్‌లో, దేశంలో నిరుద్యోగం రేటు 20.8 శాతానికి చేరుకుంది. గత త్రైమాసికంలో 11.8 శాతంగా ఉన్న మహిళల నిరుద్యోగిత రేటు ఏప్రిల్-జూన్, 2021లో 14.3 శాతానికి చేరుకుంది. ఈ కాలంలో, పురుషులలో నిరుద్యోగం రేటు కూడా జనవరి-మార్చి త్రైమాసికంలో 8.6 శాతం నుండి 12.2 శాతానికి పెరిగింది.

15-29 ఏళ్ల మధ్య నిరుద్యోగులు అధికమే.. 

 జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే  నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 15-29 ఏళ్ల మధ్య ఉన్న 25.5% మంది నిరుద్యోగులుగా ఉన్నారు, జనవరి-మార్చి త్రైమాసికంలో ఉన్న సంఖ్యలతో పోలిస్తే ఇది 2.6% పెరిగింది. 2020లో, అదే త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 34.7% గా ఉంది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, అన్ని వయసుల వారికి శ్రమశక్తిలో జనాభా శాతంగా నిర్వచించబడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 37.5% నుండి ఏప్రిల్-జూన్‌లో 37.1%కి తగ్గింది. 2020లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 35.9% ఉంది. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా జనవరి-మార్చి త్రైమాసికంలో 39.3% నుండి ఏప్రిల్ మరియు జూన్ మధ్య 40.7%కి పెరిగింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios