సారాంశం
Gujarat Polls 2022: 2021లో అప్పటి సీఎం విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేయడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్ ఎన్నికలు-2022 లో ఆయనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
Gujarat BJP's CM Face For Assembly Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా సాధారణ ద్విధ్రువ పోరు నుంచి త్రిముఖ పోరుగా మారాయి. డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ శాసనసభకు ఈసారి ఉత్కంఠ పోరు జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు రాష్ట్ర ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందు ఉన్న అన్ని ప్రయాత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఇప్పటి వరకు తీసుకున్న అనేక చర్యలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖాన్ని ప్రకటించడం కూడా ఒకటి. సీఎం ముఖాన్ని ప్రకటించకూడదని కాంగ్రెస్ నిర్ణయించగా, ఆప్ మాత్రం మాజీ జర్నలిస్టు ఇసుదాన్ గధ్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధికార పార్టీ బీజేపీ సిట్టింగ్ సీఎం భూపేంద్ర పటేల్‌తో సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.
ఎవరీ భూపేంద్ర పటేల్.. ?
భూపేంద్ర పటేల్ గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి.. ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పాటిదార్ కమ్యూనిటీకి చెందినవారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. 2021లో అప్పటి సీఎం విజయ్ రూపానీ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించడంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్ ఎన్నికలు-2022 లో భూపేంద్ర పటేల్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఘట్లోడియా మాజీ ఎమ్మెల్యే ఆనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడు.
సీఎంగా భూపేంద్ర పటేల్...
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భూపేంద్ర పటేల్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో గాట్లోడియా స్థానం నుండి లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై ఆయన విజయం సాధించారు. భూపేంద్ర పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎన్నుకోవడం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఆయన సాపేక్షంగా తక్కువ ప్రొఫైల్ ఉన్న రాజకీయ నాయకుడు. అయితే, అప్పటి సీఎం విజయ్ రూపానీ తన వారసుడిగా పటేల్‌ను ప్రకటించారనే ప్రచారం జరిగింది.
సీఎం కావడానికి ముందు..
గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే ముందు భూపేంద్ర పటేల్ ఎప్పుడూ మంత్రి పదవిలో కూడా కొనసాగలేదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇలాగే ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యే ముందు ప్రధాని మోడీ ఏనాడూ మంత్రి పదవిని తీసుకోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యే ముందు, పటేల్ 2010 నుండి 2015 వరకు థాల్తేజ్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. అంతకుముందు, 1999-2000లో మేమ్‌నాగగర్ నగరపాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి రెండుసార్లు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశాడు.
భూపేంద్ర పటేల్ నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందో లేదో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.