పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..
రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ వితంతువుపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి, మరో ఏడు రోజులు అద్దె ఇంట్లో దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ వింతంతువుకు పని ఇప్పిస్తానని, అద్దెకు గది చూపిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పలువురు దారుణానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి 14 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకొని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల వితంతువుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన పిల్లలతో కలిసి ఆమె తన తల్లి ఇంట్లో నివసించడం మొదలుపెట్టింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్లి అద్దె ఇంట్లో ఉంటూ, కూలీ పనులు చేస్తుండేది. కానీ ఆమెకు మెరుగైన పని, మంచి గది అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వారికి ఓ వ్యక్తి చేరువయ్యాడు. మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి పని ఇప్పిస్తానని, మంచి గది అద్దెకు చూపిస్తామని నమ్మించారు.
మాయమాటలతో ప్రలోభపెట్టి ఆమెను ఓ హోటల్ గదికి తీసుకెళ్లారు. అక్కడ మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె అద్దెకు తీసుకున్న కొత్త గదిలోకి తీసుకెళ్లి మళ్లీ ఏడు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. పిల్లలను చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే వారి బారి నుంచి బాధితురాలు ఎలాగోలా తప్పించుకుంది.
సెప్టెంబర్ 18వ తేదీన కమాన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తనపై ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈ కేసులో డీగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఓ వితంతువు ఆరుగురు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ కేసును కమాన్ సీఓ విచారణ చేస్తున్నారని చెప్పారు.