ఏమైనా చేయండి.. కానీ పంట వ్యర్థాలను కాల్చడం ఆపండి..-పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే ?
Delhi Air pollution : ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న పంట వ్యర్థాల నిర్వహణ తీరు పట్ల పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమైనా చేసి పంట వ్యర్థాలను కాల్చకుండా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
Air pollution in Delhi-NCR: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాలను కాల్చడాన్ని ఆపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నివేళలా రాజకీయ పోరాటం ఉండకూడదని సూచించింది.
‘‘పంట వ్యర్థాలను కాల్చడం ఆపాలని మేం కోరుకుంటున్నాం. మీరు ఎలా చేస్తారో ? ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఇది మీపని. కాబట్టి దాన్ని మీరు ఆపాలి. వెంటనే ఏదో ఒకటి చేయాలి’’ అని పంజాబ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలు ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
దాదాపు వారం రోజుల నుంచి దేశ రాజధాని భారీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత 'తీవ్రమైన' కేటగిరీలోనే ఉంటోంది. దట్టమైన పొగమంచు నగరాన్ని చుట్టుముట్టడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 నుంచి ఏడు రోజుల పాటు సరి-బేసి వాహన వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. నవంబర్ 6న పంజాబ్ లో 2,060 పంట వ్యర్థాలను తగలబెట్టిన కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. ప్రస్తుత సీజన్ లో పంజాబ్ లో పంట వ్యర్థాలను తగలబెట్టిన ఘటనల సంఖ్య 19,463 దాటింది. గత 9 రోజుల్లో పంజాబ్లో 15 వేలకు పైగా పంట వ్యర్థాలను కాల్చిన కేసులు నమోదయ్యాయి. కాగా. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.
వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నవంబర్ 13 నుండి వారం రోజుల పాటు నగరంలో సరి-బేసి వాహన వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు. తేలికపాటి కమ్సర్షియల్ వాహనాలు మినహా ట్రక్కులు, ఇతర వాహనాలపై పూర్తి నిషేధం విధించారు. బాణాసంచా కాల్చుకుండా చూసేందుకు 210 బృందాలను ఏర్పాటు చేసింది. అలాగే 345 వాటర్ స్ప్రింక్లర్లు నిరంతరం పని చేస్తున్నాయి.