Delhi Budget 2022: ఢిల్లీ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం అసెంబ్లీలో ఉపాధిపై దృష్టి సారించే 8వ వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. 2022-23 సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్ అంచనా రూ. 75,800 కోట్లు.. 2021-22 సంవత్సరానికి రూ. 69,000 కోట్ల బడ్జెట్ అంచనా కంటే 9.86 శాతం ఎక్కువ.. అలాగే, సవరించిన అంచనాల కంటే 13.13 శాతం అధికం.
Delhi Budget 2022: వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఢిల్లీ ఆర్ధిక వ్యవస్ధను పరుగులు పెట్టిస్తామని పేర్కొంటూ ఢిల్లీ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, ప్రజా ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలను గురించి ఆయన వెల్లడించారు. రిటైల్, ఫుడ్, రవాణా, సప్లయిచైన్, ట్రావెల్, టూరిజం, వినోద, నిర్మాణ, రియల్ఎస్టేట్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని తెలిపారు. రూ.75,800 కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో సమర్పించారు. రోజ్‌గార్ బడ్జెట్'2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి మరియు ఆర్థిక సంక్షేమంపై దృష్టి సారించామనీ, దీనిని రోజ్‌గార్ బడ్జెట్ గా పేర్కొన్నారు.
"ఈ రోజు మనం ఆర్థిక సంక్షేమాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో 'రోజ్‌గార్ బడ్జెట్' ను సమర్పిస్తున్నాము. 'రోజ్‌గార్ బడ్జెట్' ద్వారా రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలున్నాయి. ఈ పురోగతి ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం" అని సిసోడియా అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ 'రోజ్‌గార్ బడ్జెట్' ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
1. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ 75,800 కోట్ల బడ్జెట్‌ను సిసోడియా సమర్పించారు. ఈ ఏడాది ఢిల్లీ బడ్జెట్‌ను ఆయన ఉపాధి బడ్జెట్‌గా అభివర్ణించారు.
2. వచ్చే ఐదేండ్లలో ఢిల్లీలో ఉద్యోగుల జనాభాను ప్రస్తుతమున్న 33 శాతం నుంచి 45 శాతానికి పెంచాలనే లక్ష్యంతో చర్యలు చేపడతామని చెప్పారు.
3. విద్యారంగానికి రూ.16,278 కోట్లు, డ్రెయిన్లు, వీధులు, అనధికార కాలనీల్లో నీటి సరఫరాకు రూ.1300 కోట్లు కేటాయించారు.
4. ఆరోగ్య రంగానికి రూ.9,669 కోట్లు, మొహల్లా క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లకు రూ.475 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.1,900 కోట్లు కేటాయించారు.
5. ఎలక్ట్రానిక్స్ తయారీ ద్వారా 80,000 ఉద్యోగాలను సృష్టించేందుకు ఢిల్లీలోని బాప్రోలాలో కొత్త ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.
6. వ్యాపారాన్ని పెంచేందుకు దేశ రాజధానిలో కొత్త స్టార్టప్ పాలసీని రూపొందించనున్నారు.
7. 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఢిల్లీలోని ఐదు పేరెన్నికగన్న మార్కెట్లను అభివృద్ధి చేస్తామని చెప్పరు. అందుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు.
8. దుకాణదారులను వినియోగదారులకు కనెక్ట్ చేయడానికి ఢిల్లీ బజార్ పోర్టల్. గాంధీ నగర్‌లోని ఆసియాలోనే అతిపెద్ద గార్మెంట్ మార్కెట్‌ను గార్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు.
9. స్మార్ట్ అర్బన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించి, పూసా ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఒక ప్రజా ఉద్యమంగా మార్చబడుతుంది మరియు 'స్మార్ట్ అర్బన్ ఫార్మింగ్' చొరవ కింద మహిళలకు దాదాపు 25,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి.
10. ఢిల్లీ ప్రభుత్వం తన డిపార్ట్‌మెంట్‌లు మరియు ఏజెన్సీల కోసం బడ్జెట్ కేటాయింపుల ఉపాధి ఆడిట్‌ను నిర్వహిస్తుంది.
11. ఢిల్లీలో గత 7 ఏళ్లలో 1.78 లక్షల మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా, వారిలో 51,307 మంది శాశ్వత ఉద్యోగాలు పొందారు.
12. ఢిల్లీలో పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని ప్రోత్సహించేలా డిల్లీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని వెల్లడించారు.