సూర్యుడికి మరింత చేరువలో.. మూడో భూ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆదిత్య ఎల్ 1
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. తాజాగా తన మూడో భూ విన్యాసాన్ని తన కక్ష్యను పెంచుకుంది. ఈ కొత్త 296 కి.మీ x 71767 కి.మీ గా ఉండనుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఆదిత్య ఎల్1 మరో సారి తన కక్ష్యను మార్చుకోనుంది.

సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మొదటి ప్రయోగం విజయవంతంగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. సన్-ఎర్త్ లాగ్రాంజ్ పాయింట్ ఎల్ 1 కు చేరుకునే ప్రయాణంలో మన ఉపగ్రహం అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్ -1 మిషన్ తాజాగా మూడో భూ విన్యాసాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
మారిషస్, బెంగళూరు, ఎస్డీఎస్సీ-షార్, పోర్ట్ బ్లెయిర్ స్టేషన్లు ఈ ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయని ఇస్రో తన ‘ఎక్స్’ (ట్విట్టర్) పేజీలో పోస్టు చేసింది. ‘‘మూడో ఎర్త్ బౌండ్ విన్యాసం (ఇబీఎన్ #3) బెంగళూరులోని ఇస్ట్రాక్ నుండి విజయవంతంగా నిర్వహించాం. మారిషస్, బెంగళూరు, ఎస్డీఎస్సీ-షార్, పోర్ట్ బ్లెయిర్లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయి. కొత్త కక్ష్య 296 కి.మీ x 71767 కి.మీ గా కొనసాగనుంది’’ అని పేర్కొంది.
కాగా.. షెడ్యూల్ ప్రకారం ఆదిత్య ఎల్ 1 తన తదుపరి విన్యాసం తదుపరి విన్యాసం (ఇబీఎన్ #4) సెప్టెంబర్ 15వ తేదీన 02:00 గంటలకు జరగనుంది. అయితే ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ 5వ తేదీన తన రెండో భూ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసి 40225 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యకు చేరుకుంది.
ఆదిత్య ఎల్ 1 భారతదేశపు మొదటి సోలార్ మిషన్ కావడం గమనార్హం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సూర్యుడి గురించి తెలియని అంశాలను అన్వేషించే లక్ష్యంతో ఈ ఉపగ్రహాన్ని సూర్యుడిపై సమగ్ర అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో అంతరిక్షంలోకి పంపారు. తన తుది గమ్యాన్ని చేరుకోవడానికి ఆదిత్య ఎల్ 1.. 16 రోజుల్లో ఐదు భూ విన్యాసాలకు లోనవుతుంది. ఈ కక్ష్య విన్యాసాల వల్ల ఉపగ్రహం కోరుకున్న తను అనుకున్న బిందువు దగ్గరికి వెళ్లేందుకు, వేగాన్ని పొందేందుకు సహాయపడుతాయి.
సూర్యుడి దిశలో భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 (ఎల్ 1)ను చేరుకోవడానికి ఆదిత్య-ఎల్ 1కు నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఆదిత్య ఎల్ 1 సూర్యుడి బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. వ్యూహాత్మక స్థానం ఎల్ 1 కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించడానికి, సూర్య కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి శాస్త్రవేత్తలకు మరింత సహాయపడుతుంది.