మెదక్ : ఇటీవల వెలువడిన పదో తరగతి పలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అనాధ బాలికను అభినందించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. బాలికకు శాలువాకప్పి సత్కరించి పబ్లిసిటీ కోసం ప్రయత్నించకుండా మనస్పూర్తిగా ఆమెకు సహకరించాలని భావించారు ఎమ్మెల్సీ. దీంతో ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చి గొప్పమనసు చాటుకున్నారు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి. 

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పోచ్చమ్మరాల్ గ్రామానికి చెందిన దివ్య చిన్నప్పటి నుండి చదువులో మంచి చురుకైన అమ్మాయి. పేదింట్లో పుట్టిన ఆమె చదువంతా కనీస సౌకర్యాలు కూడా సరిగ్గావుండని ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. దీనికి తోడు దివ్య తండ్రి చాలాకాలం క్రితమే చనిపోగా ఇటీవలే తల్లికూడా మృతిచెందింది. పదో తరగతి పరీక్షలకు కొద్దినెలల ముందే తల్లి చంద్రకళ చనిపోయినా కన్నీటిని దిగమింగి ప్రిపేర్ అయ్యింది. 

తల్లి మృతి తర్వాత పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలోని అమ్మమ్మవారి ఇంట్లోనే వుంటోంది దివ్య. తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారానని బాధపడుతూ ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు దివ్య. మరింత పట్టుదలతో చదివి పదో తరగతి పరీక్షలు బాగా రాసింది. దీంతో ఇటీవల వెలువడిన ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించింది. పాపన్నపేట మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా దివ్య నిలిచింది. 

Read More  మే నెలాఖ‌రున TS EAMCET 2023 ఫలితాలు.. మీ రెస్పాన్స్ షీట్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

టాప్ మార్కులు సాధించిన దివ్య అనాధ అని తెలియడంతో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి చలించిపోయారు. ఆమెను పిలిపించుకుని శాలువాతో సత్కరించిన ఆయన ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. దివ్య చదువు ఎవరికీ బారం కాకూడదని భావించిన ఎమ్మెల్సీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఏ సాయం కావాలన్నా తనను అడగాలంటూ దివ్యకు సూచించారు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. 

 తన ప్రతిభను గుర్తించి అభినందించడంతో పాటు సాయం చేయడానికి ముందుకొచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి దివ్య కృతజ్ఞతలు తెలిపారు. అనాధ బాలికకు సాయం చేసేందుకు మంచి మనసును  ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డిని ప్రజలు కూడా అభినందిస్తున్నారు.