Parliament Session 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ముగిసాయి...  మెజారిటీ ఎంపీ సీట్లు సాధించిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అదిరోహించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేయగా తాజాగా ఎంపీల ప్రమాణస్వీకారం కూడా ముగిసింది.  

అయితే ఎంపీల ప్రమాణస్వీకార ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొందరు ఎంపీలు తమ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను  ...మరికొందరు తమ పార్టీ సిద్దాంతాలను... ఇంకొందరు తమ మాతృబాషను ప్రతిబింబించేలా ప్రమాణస్వీకారం చేసారు. ఇలా మన తెలుగు ఎంపీలు కూడా లోక్ సభలో తెలుగుతనం ఉట్టిపడేలా వ్యవహరించారు. కిషన్ రెడ్డి లాంటివారు అచ్చతెలుగు వేషధారణలో వస్తే... పెమ్మసాని చంద్రశేఖర్ వంటివారు అచ్చ తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి... ఇలా అత్యధిక తెలుగు ఎంపీలు మాతృబాషలోనే ప్రమాణస్వీకారం చేసారు. 

ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ఎప్పటిలాగ ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసారు. అయితే ప్రమాణస్వీకార ముగింపులో జై పాలస్తీనా అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ  కామెంట్స్ ను తప్పుబట్టిన బిజెపి రికార్డ్స్ నుండి తొలగించాలని ప్రోటెం స్పీకర్ ను కోరారు... అందుకు ఆయన అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.

ఇక మరో ఎంపీ ఈటల రాజేందర్ కూడా తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర నినాదం చేసారు. మేడారం వన దేవతలను తన ప్రమాణస్వీకార సమయంలో తలచుకున్న ఈటల లోక్ సభలో జై సమ్మక్క‌-సారలమ్మ అంటూ నినదించారు. మరో ఎంపీ కడియం కావ్య జై భద్రకాళి అంటూ నినదించారు.

 

తెలంగాణ ఎంపీలో ఎవరు ఏ బాషలో ప్రమాణస్వీకారం చేసారంటే... 

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బిజెపి ఎంపీలు ఈటల రాజేందర్, డికె అరుణలు తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రెస్ ఎంపీల్లో రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి,సురేష్ షెట్కార్ లు కూడా తెలుగులోనే ప్రమాణస్వీకారం చేసారు.  ఇక ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామసాయం రఘురామిరెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఇంగ్లీష్ లో, నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేసారు.