హైదరాబాద్ : కేసీఆర్... ఇది తెలంగాణలో ఎక్కువగా వినిపించే పేరు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రిగా ఆయన అందరికీ సుపరిచితమే. గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం అంటేనే కేసీఆర్ ... సర్వాధికారాలు ఆయనవే. అటు రాజకీయాల్లోనూ, ఇటు పాలనలోనూ కేసీఆర్ దే ఆధిపత్యం... ఆయన చెప్పిందే వేదం... చేసేదే చట్టం.... తెలంగాణ ఆయనను మించినివారే లేరు... ఎప్పటికీ ఆయనకు  తిరుగుండదు అన్నట్లుగా వుండేది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా వుండవు...  ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి...పూలమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి వస్తుంది... సరిగ్గా కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే మారింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందువరకు కేసీఆర్ దే ఆధిపత్యం... కానీ ఒక్కసారి బిఆర్ఎస్ ఓటమిపాలవగానే పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. ఒకప్పుడు కేసీఆర్  వెన్నంటివున్న నాయకులంతా ఓటమితర్వాత ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు... ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసిన వారంతా ఆయననే ఎదిరించసాగారు. అంతే కాదు కేసీఆర్ తో పాటు కుటుంబసభ్యులు అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు... ఆయన కూతురు కవిత అయితే గత మూడు నెలలుగా జైల్లో వున్నారు. ఇలా అధికారాన్ని కోల్పోయి... రాజకీయంగా బలహీనపడి... తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న కేసీఆర్ ను అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా తయారయ్యింది మాజీ సీఎం పరిస్థితి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఓటమి బాధలో వున్న కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ప్రమాదానికి గురయ్యారు. కాలుజారి కిందపడిపోయిన ఆయనకు తీవ్ర గాయాలపాలయ్యారు. తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ చికిత్స పొందారు. చివరకు కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ చేయడంతో చాలాకాలం బెడ్ కే పరిమితం అయ్యారు.   

అయితే శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం వాకర్ సాయంతో నడిచారు కేసీఆర్. ఇలా ఫిజియో థెరపీ డాక్టర్ల పర్యవేక్షణలో మెల్లిగా నడక ప్రారంభించి డిశ్చార్జి తర్వాత కర్ర సాయంతో నడవడం ప్రారంభించారు. గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా కర్ర సాయంతో నడుస్తూ కనిపించారు. అయితే ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో చేతి కర్ర లేకుండానే నడుస్తున్నారు.    

కేసీఆర్ పరిస్థితి పూర్తిగా నార్మల్ అయ్యిందోలేదో తెలుసుకునేందుకు తాజాగా డాక్టర్లు డ్రైవింగ్ టెస్ట్ చేసారు. స్వయంగా వాహనం నడిపి చూడాలని... శస్త్రచికిత్స జరిగిన తుంటి  భాగంతో ఇంకా ఏదయినా సమస్య వుంటే వాహనం నడిపే సమయంలో బయటపడుతుంది...  అందువల్లే ఓసారి స్వయంగా డ్రైవింగ్ చేసిచూడాలని వైద్యులు సూచించారు. దీంతో తన ఫార్మ్ హౌస్ లోని ఓ పాత ఓమ్నిని స్వయంగా నడిపారు మాజీ సీఎం. ఇలా కేసీఆర్ ఓమ్నీ నడుపుతున్న ఫోటో బయటకు వచ్చింది. 

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఖరీదైన కార్లతో కూడిన కాన్వాయ్ లో తిరిగిన కేసీఆర్ ను చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఓమ్ని నడపడం కూడా చూస్తున్నారు. అయితే ఇలా కేసీఆర్ ఓమ్నీ నడపడాన్నిబిఆర్ఎస్ నాయకులు సింప్లిసిటీ అంటుంటే ప్రత్యర్థి పార్టీలవారు మాత్రం కాలమే ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం చెబుతుందని అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. ఖరీదైన కార్లున్నాయి... నడిపేందుకు డ్రైవర్లు వున్నారు... కానీ సామాన్యులు వాడే ఓమ్నీని స్వయంగా కేసీఆర్ నడపాల్సిన పరిస్థితి వచ్చింది.