హైదరాబాద్ : ఆమ్రపాలి... తెలంగాణలోని ఐఏఎస్ అధికారుల్లో ఈమె చాలా ప్రత్యేకం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సైతం దక్కని ప్రాధాన్యత ఈమెకు దక్కుతోంది. కేంద్ర సర్వీసులో వున్న ఈ యువ ఐఏఎస్ ను రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ కీలక బాధ్యతలు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకు గుండెకాయలాంటి రాజధాని హైదరబాద్ మొత్తాన్ని ఈమె చేతిలో పెట్టేసారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమ్రపాలికి   ఏ స్థాయి ప్రాధాన్యత దక్కుతుందో. 

ఇలా తెలంగాణలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఐఏఎస్ ఎవరు..? ఈమె ఎందుకంత ప్రత్యేకం? ఎందరో సీనియర్లను కాదని సీఎం రేవంత్ ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. వీటికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాధానం ''కాట ఆమ్రపాలి రెడ్డి''. ఈమె పేరు వెనకాల వున్న రెడ్డి అనే పదం ఆమె సాధించిన ఐఏఎస్  కంటే ఎక్కువ పనిచేస్తోందని... అందువల్లే ఆమెకు ఈ పదవులు, ఈ హోదా, ఈ ప్రాధాన్యత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ఒక్క ఆమ్రపాలికే ఐదు పోస్టులా..!! 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీస్ లో పనిచేస్తున్న ఐఏఎస్ ఆమ్రపాలి తిరిగివచ్చారు. వస్తూవస్తూనే ఆమెకు హైదరాబాద్ లో కీలక బాధ్యతలు అప్పగించారు...తాజాగా చేపట్టిన బదిలీల్లో మరికొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా ప్రస్తతం ఒక్క ఆమ్రపాలి వద్దే ఐదు పోస్టులు వున్నాయి.  

ఇప్పటికే ఆమ్రపాలి జాయింట్ మెట్రోపాలిటన్  కమీషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమీషనర్ గా వ్యవహరిస్తున్నారు. తాజా బదిలీల్లో జిహెచ్ఎంసి కమీషనర్ గా అత్యంత కీలక బాధ్యతలు ఆమ్రపాలికి అప్పగించారు. దీంతో ఆమ్రపాలి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 

ఎవరీ ఆమ్రపాలి ఐపిఎస్ : 

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ   శివారులోని చిన్నగ్రామం ఎన్ అగ్రహారం (నర్సాపురం). ఈ గ్రామానికి చెందిన కాట  వెంకట్ రెడ్డికి టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలు పద్మావతితో వివాహమయ్యింది. వీరి ముద్దుల కూతురే కాట ఆమ్రపాలి రెడ్డి.  

తండ్రి వెంకట్ రెడ్డి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడంతో ఆమ్రపాలితో పాటు సోదరి మానస గంగోత్రి విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. అక్క గంగోత్రి 2007 లో ఆఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) కు ఎంపిక కావడమే ఆమ్రపాలిని సివిల్ సర్విసెస్ వైపు నడిపించింది. ఉన్నత చదువులు ముగించుకున్న ఆమ్రపాలి సివిల్స్ ప్రిఫరేషన్ ప్రారంభించారు. ముందునుండే చదువులో చురుగ్గా వుండటంతో పాటు ఎంతో కష్టపడి ప్రిపేర్ కావడంతో 2010 అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఆమ్రపాలి. సివిల్స్ లో 39వ ర్యాంక్ సాధించి ఐఎఎస్ గా ఎంపికయ్యారు. 

తెలుగమ్మాయి ఆమ్రపాలికి ఆంధ్ర ప్రదేశ్ లోనే పోస్టింగ్ లభించింది.  అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణకు కేటాయింపబడ్డారు. 2018లో వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల కలెక్టర్ గా వ్యవహరించారు. అయితే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆమ్రపాలి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆమె మొదట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసారు.  ఆ తర్వాత 2020లో ప్రధాన నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమ్రపాలి తిరిగి రాష్ట్రానికి వచ్చారు.

2018లో ఆమ్రపాలికి జమ్మూ  కాశ్మీర్ కు చెందిన శమీర్ శర్మతో వివాహం అయ్యింది. అతడు కూడా 2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి.  ప్రస్తుతం అతడు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.