విజయవాడలో ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలతో విజయవాడలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి.
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిద్ధార్థ కళాశాలలోని రాజరాజ నరేంద్ర ప్రాంగణంలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిలికానాంధ్ర, సిద్ధార్థ అకాడమీ సంయుక్త ఈ రచయితల మహాసభలు నిర్వహిస్తున్నారు. గత రెండుమూడు రోజులుగా జరుగుతున్న ఈ సమావేశాలకు డా.మండలి బుద్ధప్రసాద్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ వివిధ వేదికలపై తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల విశిష్టత... వాటికి తిరిగి వైభవం తీసుకరావడంలో రచయితల, కవుల బాధ్యతలను గుర్తుచేస్తూ ప్రసంగించారు.
తెలుగు రచయితల మహాసభలో తెలంగాణకు చెందిన పాలమూరు జిల్లా కవులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్ మాట్లాడుతూ... కేవలం మహాసభలు జరపడంతోనే సరిపోదు, విద్యా విధానంలో పాఠశాల స్థాయి నుండి తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఖాజమైనుద్దీన్ మాట్లాడుతూ... తెలుగు భాష ఉన్నతి కోసం మరో ఉద్యమం చేయాలన్నారు.
Read More ‘తెలుగు భాష - ఆధిపత్యాలు’.. హైదరాబాద్ లో రాష్ట్ర సదస్సు..
కె.ఎ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ... మాతృభాషలో మాట్లాడకపోతే మన అమ్మను మరచినట్లేనని అన్నారు. పరభాషలు ఎన్ని నేర్చినా మన తెలుగును విడనాడితే మన అస్తిత్వాన్ని కొల్పోయినటే అన్నారు. పులి జమున మాట్లాడుతూ... వివిధ ప్రక్రియలతో, విచిత్ర పదబంధాలతో, నానుడులు, పలుకు బడులు, నుడికారపు సొంపులతో మదిని దోచి మైమరపించే మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే అమ్మ ఒడి నుండి నేర్చిన తెలుగు భాష మమకారాన్ని పిల్లలలో పెంపొందించాలి అన్నారు. ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషా బోధనను అమలు పరచాలి. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగుభాషలో వుండే విధంగా చూడాలి. కవులు,కళాకారులు తెలుగు భాషా అభివృద్ధికి సభలు,సమావేశాలు నిర్వహించి తెలుగు భాషోద్యమానికి పాటు పడాలి అని అన్నారు. మృధు మధురమైన తెలుగు భాషాసౌందర్యాన్ని భావితరాలకు అందించి తెలుగు భాషను అమరం చేయాల్సిన బాధ్యత మనందరిపై వుంది అని నొక్కి చెప్పారు. మంగతాయారు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాష మాట్లాడి మన తల్లిని గౌరవించుకుందాం, మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చినటే అని వాపోయారు.
నందిగామ కిశోర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు సభలు ఎంత బాగా నిర్వహించుకుంటుంన్నామో అలాగే ప్రతి ఒక్కరూ మాతృభాషను సంప్రదాయాలను అచరణలో ఉండేవిధంగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. సుంకరి బసవ రాజప్ప మాట్లాడుతూ తల్లిని ఏవిధంగా ప్రేమిస్తామో తల్లి భాష తెలుగును కూడా ప్రేమించాలి అని అన్నారు. ఇంకా ఇరివెంటి వేంకటేశ్వర శర్మ , డా.జి.వి.పూర్ణచందు, గుత్తికొండ సుబ్బారావు, డా.నూనె అంకమ్మారావు తదితరులు పాల్గొన్నారు.