విల్సన్ రావు కొమ్మవరపు కవిత : నాగలి కూడా ఆయుధమే.!

అభివృద్ధి ఎరుగని చట్టాలన్నీ దారం తెగిన పతంగుల్లా  నాట్య విన్యాసాలు చేస్తున్నప్పటికీ నాగలి ఎప్పటికీ ఒంటరి కాదని " నాగలి కూడా ఆయుధమే.!" అని అంటున్న విల్సన్ రావు కొమ్మవరపు కవితను ఇక్కడ చదవండి.

Wilson Rao Kommavarapu Telugu poem

సంఘర్షణ మాకేమీ కొత్త కాదు
శ్రమకు ప్రతిఫలంగా కలలే మిగులుతున్నప్పుడు
కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు
నిత్యం మట్టికి మొక్కడమొక సహజాతం మాకు.

భూమికీ ఒక గుండె ఉందని
ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక
దాని ఊపిరితో ఊపిరి కలిపి
ఒక జ్వలనచేతనలో
నాలుగు చెమట చుక్కలు
ధార పోయకుండా ఉండలేము.

అలసటెరుగని దుక్కిటెద్దులు
నెమరేతకూ దూరమై
భద్రత లేని సాగుతో
అభద్ర జీవితం గడుపుతున్న
నిత్య దుఃఖిత సందర్భాలు!

ఆకలి డొక్కలు నింపే 
చట్టాలుచేయాల్సిన చట్ట సభలు
భూమి గుండెకు ఊపిరి పోయడం
ఒక మానవోద్వేగమని తెలియక
నాగలిని నిలువునా చీల్చేస్తున్నప్పుడు
అభివృద్ధి ఎరుగని చట్టాలన్నీ
దారం తెగిన పతంగుల నాట్య విన్యాసాలే!

ఇప్పుడు
నాగలి ఒంటరి కాదు 
నాగలి ఒక సమూహం
నాగలి ఈ దేశపు జీవితం 
నాగలి ఉత్పత్తికి జీవం
నాగలే మా సర్వస్వం 
ఇప్పుడు  నాగలే మా ఆయుధం..!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios