తన మిత్రుడిని గుర్తు చేసుకుంటూ ఆయన స్మృతిలో విల్సన్ రావు కొమ్మవరపు కవిత రాశారు. దాన్ని ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.

దేహాలే వేరు
మనసులొకటేనా!?
ఆత్మలొకటేనా!?
ఏమో!
అవునేమో!?

నన్ను నువ్వు కలిశావో
నిన్ను నేను కలిశానో
మొత్తం మీద 
కలిసి మెలిసి ఉన్నాం
కాలాన్ని కలిసి పంచుకున్నాం
నీ ఇష్ట ప్రకారమే...

నేను ఒంటరినయ్యానా!?
ఏమో!?

నువ్వు ఎవ్వరికీ కనబడవనే
దుగదే గానీ
నా జీవితపు రహదారుల్లో
నీవు పరచిన పాదముద్రలు
ఎప్పటికీ చెరగవు...

నువ్వు ఇక ఎప్పటికీ
ఎవరితోనూ మాట్లాడలేవనే గానీ
నీవు మాతో పంచుకున్న భావ పరిమళాలు
మా చెవుల్లో గింగిర్లు కొడుతున్నాయి...

నీమీద నువ్వు ఆధిపత్యం సాధించుకోడానికి
ప్రతి రోజు బహిరంతర యాత్ర సాగిస్తూ
నీ ఆత్మీయ పలకరింపుతో
నా హృదయం మీద పొడిచిన పచ్చబొట్టు ఆనవాళ్లు అలాగే--

జీవన దుఃఖాన్ని 
నిలువునా పాతేసి
కొంత వేదన పడింది నిజమే!
ఐనా నీ వేదన ముందు
నా వేదన ఏపాటిది!?

ఆత్మీయంగా
చివరిసారిగా
నిన్నొక మాట అడగనా?
పిచ్చిమొఖమా!
ఎందుకంత తొందర పడ్డావు?

30.11.2019
(ఆత్మీయ నేస్తం స్మృతి లో)

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature