Asianet News TeluguAsianet News Telugu

విల్సన్ రావు కొమ్మవరపు కవిత : శ్రుతితప్పిన పాట

'మానవీయంగా ఉండటం బలహీనతకు సంకేతం కాదు కదా!' అంటూ విల్సన్ రావు  కొమ్మవరపు రాసిన కవిత  ' శ్రుతితప్పిన పాట ' ఇక్కడ చదవండి :

Wilson Rao Kommavarapu poem - bsb - opk
Author
First Published Aug 3, 2023, 2:00 PM IST

ఒళ్ళంతా -
కట్టెలపొయ్యిపై వేడెక్కుతున్న పెనంలా ఉంది
కొలిమిలో కాలుతున్న కొడవలిలా ఉంది

ఏ భాగంపై నీళ్ళు చిలకరించినా
సుయ్యిమనే శబ్దంతో
చల్లిన నీళ్ళు రెప్పపాటులో ఆవిరవుతున్నాయి

చెవులు మూసుకుపోతున్నాయి
కళ్ళు దిమ్ములెత్తుతున్నాయి
ముక్కు మాట్లాడలేకపోతోంది
నోరు శ్వాసించడం మానేసింది

ఒక్క మాటలో చెప్పాలంటే
నా సర్వావయవాలు ఉనికి కోల్పోయి
మానం, ప్రాణం దుఃఖదీవిలో పెనుగులాడుతోంది
మరణపు అంచున ఖైదులో విలవిల్లాడుతోంది

రక్షించే చేతుల కోసం ఏడ్చి ఏడ్చి
ఏడుపుకు ఏడుపే సమాధానమైంది

జీవశక్తిని నరనరాన నింపుకొని
మానవ మృగపు రెండుకాళ్ళ సందులో
బలంగా ఒక్క తన్ను తన్నాలనివున్నా-

మానవ మృగ శిస్నాల దాడిలో 
సత్తువ కోల్పోయిన నా తొడలు
వీర్యపు చెరువులయ్యాయి

పారదర్శక పాలన పేరుతో
క్విక్ ఫిక్స్, ఫెవికాల్ ను
టన్నులకొద్దీ రాసుకొని
రాజకీయం అనేక జిమ్మిక్కులు చేస్తోంది
వర్గ సంఘర్షణలో ఇదొక
శ్రుతితప్పిన పాట అని
సరిపుచ్చుతోంది
     
   *        *
కుల,మత చాందసం అంటని తల్లుల్లారా!
ఒక్క మాటంటే ఒక్క మాట-

గడ్డ కట్టిన మీ మంచుమౌనంపై
వేడినీళ్ళు చిలకరించి
అసలైన చప్పట్లు ఇప్పుడు కొట్టండి
ఆ హోరులో మానవోద్వేగాలు ఉరకలెత్తాలి
మానవ సముద్రాలు పోటెత్తాలి
మానవ మృగాల మగతనం నిర్వీర్యమయ్యేదాకా-

'మానవీయంగా ఉండటం
బలహీనతకు సంకేతం కాదు కదా!'

(జూలై నెల శీలా వీర్రాజు  స్మారక బహుమతి  పొందిన కవిత)

Follow Us:
Download App:
  • android
  • ios