Book Review: "పకోడి పొట్లం"లా ఊరించే కథలు

పుస్తక సమీక్ష : ఆర్.సి కృష్ణ స్వామి రాజు రాసిన "పకోడి పొట్లం" పై పీలేరు నుండి వినాయకం ప్రకాష్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.

Vinayakam Prakash on RC Krishna Swami Raju Pokodi Potlam stories

మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి  కథారచన  చక్కటి వేదిక.  చెప్పదలుచుకున్న విషయాన్ని  క్లుప్తంగా సూటిగా సుత్తి లేకుండా కట్టే కొట్టే తెచ్చే  అనే రీతిలో రూపం పోసుకున్న చిన్న కథలు పాఠకులను ఎప్పుటికీ  అలరిస్తూనే ఉంటాయి.  ఇలాంటి కథలు చదవడానికి కావలసిన సమయం కూడా చాలా తక్కువ మరియు తొందరగా అర్థమవుతాయి.  ఇటువంటి 60 చిన్న చిన్న కథలను సమాజం యొక్క హితం కోరుతూ నవ్వులు పంచుతూ, ఆలోచనలను రేకెత్తిస్తూ  ఇంకా ఇంకా చదవాలి అని  ఉత్సాహాన్ని నింపే  కథలు అన్నింటినీ "పకోడి పొట్లం" అనే పుస్తకం రూపంలో విడుదల చేశారు ప్రఖ్యాత రచయిత  ఆర్ సి కృష్ణ స్వామి రాజు.

వీరి కథలు చదువుతుంటే భలే ఉన్నాయే..! అనిపిస్తాయి, కార్డు కథల రూపంలో పరిచయం ఉన్న రకరకాల శీర్షికలతో నీతిని బోధిస్తూ, గుణపాఠాలను నేర్పిస్తూ, ఆసక్తిని కలిగిస్తూ, సన్మార్గాన్ని చూపిస్తూ, మనం మర్చిపోయిన ఎన్నో సామెతలను మళ్లీ మనకు గుర్తు చేస్తూ నిత్య జీవితంలో మనందరికీ ఉపయోగపడే విధంగా కథలను రచించిన  రచయిత తీరు నిజంగా అభినందనీయం.  ఈ కథలు పిల్లలకు నీతి బోధను, పెద్దలకు బతుకు పాఠాలను నేర్పుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అత్యుత్సాహం వద్దని కోడి కూత అనే కథ తెలిపితే, మంచి చెడుల సారాన్ని మరియు లౌక్యముగా వ్యవహరించాలని   నెమలీక, మంత్రి లౌక్యం , తులాభారం కథలు వివరిస్తాయి.

"గతాన్ని నెమరు వేసుకోకుండా భవిష్యత్తు పట్ల భయాందోళనలు చెందకుండా ప్రస్తుతం ఉన్న స్థితిని ఆస్వాదిస్తే అదే ఆనందాన్ని ఇస్తుంది "అంటూ వెదుకులాట అనే కథ ద్వారా చక్కని సందేశాన్ని సమాజానికి ఇచ్చారు ఈ కథా రచయిత.  మన పని మనం చేసుకోవడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం, ఉచితంగా వైద్యం చేయాలని సంకల్పం రావడం, వ్యాపార నైపుణ్యాలు,  ప్రయత్నం చేయడంవల్ల వచ్చే ఉపయోగాలు, ఎవరు ఆదరించని పట్టణాల్లోని మూగజీవాల పట్ల దయ  ఇలా చెబుతూ పోతే ఈ పుస్తకంలో ఎన్నో సుగుణాలు చక్కటి చిక్కనైన కథల రూపంలో మనల్ని ఏకబిగిన చదివిస్తూ విజ్ఞానవంతులను చేస్తాయి.

నల్లి మిషన్, లిఫ్ట్ ప్లీజ్, పాపం ఆడాళ్ళు, ఇలాంటి కథలు నవ్వు తెప్పిస్తాయి.   డబ్బు విలువ, పకోడీ పొట్లం, కర్రీస్ కార్నర్  ఇలాంటి కథలు చదివింపచేస్తాయి.  "తప్పులు వెదికే వాడు తండ్రి లాంటి వాడు, ఒప్పులు వెతికే వాడు ఓర్వలేని వాడు" అనే సామెత  చుట్టూ "విమర్శ" అనే చక్కటి కథనం నిర్మించిన తీరు బాగుంది.  యధా రాజా తథా ప్రజా తద్వారా ప్రజలకు బాధ్యతలను నేర్పడం, పాండవ గుళ్లు కథ ద్వారా  వ్యాయామం ఆవశ్యకతను ఇలా  సమాజంలోని అన్ని వర్గాలను అన్ని కోణాలను స్పృశిస్తూ సరళమైన భాషలో స్థానిక విశేషాలను తెలుపుతూ చైతన్యం కలిగించడం ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత.

పుస్తక ప్రతులకి సంప్రదించండి
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
తిరుపతి
ఫోన్.9393662821. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios