Asianet News TeluguAsianet News Telugu

పిల్లా..! పద్యాల పుట్టా...?... అదరగొడుతున్న విజయవాడ బాలిక

అంతర్జాతీయ పద్య పోటీల్లో వరుసగా నాలుగోసారీ విజయవాడ బాలిక వనిజ అదరగొట్టింది. 

Vijayawada Girl Vaneeja super talent AKP
Author
First Published Oct 11, 2023, 2:46 PM IST

వరుసగా 2020, 2021, 2022, 2023 లలో అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠన పోటీలలో విజయవాడలోని ‘నలందా విద్యానికేతన్’ 7వ తరగతి విద్యార్థిని అద్దంకి వనీజ ప్రథమస్థానంలో నిలిచి తన విజయపరంపరను కొనసాగించింది. వందలాది భాగవతం పద్యాలు.. నోరు తిరగని రఘువీర గద్యం.. నరసింహ గద్యం.. శ్రీనివాసగద్యం లాంటి గద్యలను అలవోకగా అనర్గళంగా చాలా స్పష్టంగా చెప్తూ గత నాలుగైదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అద్దంకి వనీజ ఇప్పుడు మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. 

‘రవి గాంచిన పోతన భాగవతం’ పేరిట భాగవతం ఆణిముత్యాలు (IBam) సంస్థవారు ఆస్ట్రేలియా నుంచి ఉత్తర అమెరికా వరకూ ఉన్న  (ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, భారతదేశం) దేశాలలోని 6-18 సంవత్సరాల పిల్లలకు నిర్వహించిన పోతన భాగవతం పద్యాల అంతర్జాతీయ అంతర్జాల పోటీలో 10-13 వయస్సు విభాగంలో అత్యుత్తమస్థానంలో నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.  ఈ పురస్కారానికి గానూ 251 డాలర్ల (రూ.20,395/-) నగదు బహుమతిని IBam సంస్థ అధినేత శ్రీమాన్ పుచ్చా మల్లిక్ గారు ప్రకటించారు. 

గత రెండు నెలలుగా ‘నరసింహ జయంతి నుండి వామన జయంతి వరకూ’  సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా ఇంకా ఉత్తర అమెరికాలోని అనేక రాష్ట్రాలతో సహా భారతదేశంలోని 1000 కు పైగా బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. వాటి ఫలితాలను తేది. 10.10.2023 న ప్రకటించారు. విజయవాడ పట్టణంలోని నలందా విద్యానికేతన్ స్కూల్‌లో వనీజ ప్రస్తుతం 7వ తరగతి చదువుతోంది.  ప్రముఖ సంగీత విద్వాంసుడు, చలనచిత్ర నేపథ్య గాయకుడు అయిన నేమాని పార్థసారథి శిష్యురాలు అద్దంకి వనీజ.  వారి వద్ద శాస్త్రీయ సంగీతం, పోతన భాగవతం పద్యాలు నేర్చుకుంటోంది.  అలాగే కొమాండూరి రామాచారి వద్ద లలిత సంగీతం నేర్చుకుంటోంది. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి సూర్యదేవర సింధుజ వద్ద, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత మరియు నృత్యకళాశాలలో సుప్రసిద్ధ కూచిపూడి ఆచార్య ఉషారాణి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది.  ఘట్టి బాల చైతన్యంలో ఘట్టి కృష్ణమూర్తి వద్దే తెలుగు సాహిత్యంలోని పద్యాలను నేర్చుకునే ప్రస్థానం మొదలయ్యింది.  

ఈ పోటీలలో గెలిచినందుకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు  డా.  నందమూరి లక్ష్మీపార్వతి, అలాగే చి. వనీజ చదువుతున్న నలందా విద్యానికేతన్ చైర్మన్ విజయబాబు, ఇంకా పెద్దలందరూ అభినందనలూ, ఆశీర్వచనాలు అందిచారు.  మరిన్ని పోటీలలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. 

చి. వనీజ విజయాల పరంపరలో... మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ.. అంటూ గుక్కతిప్పుకోకుండా ఒక చిన్నారి 5 నిముషాలపాటు చదివిన పోతన భాగవతం - గజేంద్రమోక్షంలోని గద్యం ఒకటి ఎంతోకాలంగా సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత ఆదరణ పొందింది. వాట్సాప్‌లో అనేకసార్లు షేర్ చేసిన వీడియోగానూ గుర్తింపు పొందింది. ఆ గద్యం చదివిన చిన్నారి ఎవరో కాదు- అద్దంకి వనీజ. తను ఇప్పుడు 2022 లోనే కాక ఇప్పుడు 2023లో కూడా శ్రీమాన్ పుచ్చా మల్లిక్ నిర్వహించిన పోతన భాగవతం ఆణిముత్యాలు అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠనపు పోటీలలో ప్రథమ బహుమతిని పొందింది.  2021లో శ్రీమాన్ వి. ఎల్. శ్రీనివాస మూర్తి వాగ్దేవికళాపీఠం,  శ్రీమాన్ వద్దిపర్తి పద్మాకర్ గురువు నేతృత్వంలో ప్రణవపీఠం సంయుక్తంగా నిర్వహించిన 29 దేశాల నుంచి దాదాపు 1,400 మందికి పైగా పాల్గొన్న  పోటీలలో రావూరి విభాగం నుంచి వనీజ ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది.  2020 సంవత్సరంలోనూ వాగ్దేవి కళాపీఠం నిర్వహించిన ‘పద్యానికి పట్టాభిషేకం’ అనే పద్య పఠనపు పోటీలలో వనీజ ప్రథమ బహుమతిని పొందింది. 

'తానా' వంటి అనేక ప్రపంచసాహిత్య వేదికలపై పద్యగానం చేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి ఎందరో పెద్దల ఆశీస్సులు పొందింది ఈ చిన్నారి.  ఇటీవల తానావారి సభలలో (తేదీ. 26.3.2023 న) శ్రీమాన్ తోటకూర ప్రసాద్ ఆహ్వానం మేరకు విశిష్ట అతిథిగా పాల్గొంది. ఇలా వరుసగా నాలుగుసార్లు అంతర్జాతీయంగా పద్యపఠన పోటీలలో అద్దంకి వనీజ ప్రథమస్థానంలో నిలిచి విజయం సాధించింది.

భద్రాచలంలోని అనంతాళ్వాన్ పిళ్ళై పీఠాధిపతులు  శ్రీమాన్ ఎస్.టి.జి. శ్రీమన్నారాయణాచార్యులవారు చి. వనీజకు   బాలసరస్వతి అనే బిరుదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. తెలంగాణా అసోసియేషన్ ఆప్ సౌత్ ఆఫ్రికా మరియు జయహో భారతీయం వారు కలిసి శోభకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కారాలలో (2023) చి. వనీజకు బాలరత్న బిరుదును ఇచ్చి సత్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios