Asianet News TeluguAsianet News Telugu

కాలిఫోర్నియాలో ఘనంగా "వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం..

దశాబ్దకాలంగా ప్రవాసాంధ్రుల సాహిత్యసేవలో ఉన్న వీక్షణం సాహితీ వేదిక ఇటీవల దశమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.  

Veekshanam Literary Forum 10th Anniversary celebration in California
Author
First Published Sep 14, 2022, 12:19 PM IST

అమెరికా : 2012 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలో  నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్న "వీక్షణం" సాహితీ వేదిక ఇటీవల దశమ వార్షికోత్సవం జరుపుకున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

సెప్టెంబరు 11, 2022 న ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం దశమ వార్షికోత్సవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లో అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత అవధాని మేడసాని మోహన్ విచ్చేసి, ప్రసంగించారు.    

"వీక్షణం జీవన సాఫల్య పురస్కారాన్ని" మేడసాని మోహన్, కోమటి జయరాంల చేతులమీదుగా ప్రముఖ రచయిత డా. అక్కిరాజు రమాపతిరావు అందుకున్నారు. రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవంలో స్థానిక ప్రముఖ కవులు, రచయితలు  శ్రీచరణ్ పాలడుగు, డా.వేమూరి వేంకటేశ్వర్రావు, సుభాష్ పెద్దు, వేణు ఆసూరి, మధు ప్రఖ్యా మొదలైనవారు పాల్గొని, ఉపన్యసించారు. ఈ సభలో అపరాజిత (గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం 1993-2022), అసింట (డా.కె.గీత కవిత్వం-పాటలు) పుస్తకావిష్కరణలు, వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు జరిగాయి. 

"కొత్తకథ దిశ- గమనం" అనే అంశంమీద  మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతన జరిగిన చర్చలో డా. ఏ.కే. ప్రభాకర్, డా.కే.వి.రమణారావు పాల్గొన్నారు. రావు తల్లాప్రగడ అధ్యక్షతన జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక కవులు డా. కె.గీత, శారద కాశీవఝల, అపర్ణ గునుపూడి ,  శ్రీధర్ రెడ్డి , ప్రసాద్ వరకూరు, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి ,  షంషాద్, శశి ఇంగువ, దాలిరాజు, కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, వికాస్ విన్నకోట, శ్యామ్ సుందర్ పుల్లెల, సుమలత మాజేటి, మల్లవరపు సాయికృష్ణ, ఆచంట స్వాతి కవితాగానం చేసారు.

ప్రముఖ సాహితీవేత్త  కిరణ్ ప్రభ "సాహితీ క్విజ్" ని నిర్వహించి,  సమాపనోపన్యాసం చేసారు. 2012 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలో "వీక్షణం" సాహితీ వేదిక నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios