గతం వర్తమానానికి పునాది.  వర్తమానం భవిష్యత్తుకు మార్గదర్శి.  అందుకే వర్తమానములో కానీ, భవిష్యత్తులో గాని మానవ జీవనం సుఖంగా సాగాలన్నా, పురోభివృద్ధి చెందాలన్నా గతకాలం జ్ఞాపకాలు, అనుభవాలు, చరిత్రలు అవసరం.

గత చరిత్రలను అధ్యయనం చేయడం ద్వారా ఆనాటి ప్రజల జీవనస్థితిని, వారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవచ్చు.  నాటి పాలకుల పరిపాలనా విధానాలను, నాటి నుండి నేటి వరకు వివిధ అంశాలలో వచ్చిన మార్పులను, మంచీచెడులను అవగతం చేసుకోవచ్చు.  ఈ విషయాలను నేటి తరం విద్యార్థులకు బోధించి మార్గదర్శనం చేయవచ్చు.

ఇలాంటి చారిత్రక నేపథ్యంతో రచింపబడిన గ్రంథం "బేచిరాగు".  బేచిరాగు అనేది ఉర్దూ పదం.  దానికి అర్థం నిర్జన గ్రామం లేదా ప్రదేశం.  దీని రచయిత శ్రీ కందూరు లింగారెడ్డి.  పూర్వపు పాలమూరు జిల్లా నేటి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మల సూగూరు గ్రామానికి చెందిన ఈ రచయిత వృత్తిరీత్యా ఆంగ్ల భాషో పాధ్యాయులు.  స్వభావరీత్యా సాహిత్య పిపాసి.  చారిత్రక అంశాల అధ్యయనముపై మక్కువ ఎక్కువ.  వీరు రాసిన ఈ గ్రంథం సూక్ష్మంగా వారి గ్రామ చరిత్రే అయినా, నాటి నిజాం రాజ్యములో ఉన్న ఆరాచకపు పరిస్థితులు, రైతులను ఇబ్బంది పెట్టిన భూమి శిస్తు, లేవీ గల్లా విధానాలు, నాటి గ్రామ రెవిన్యూ పరిపాలన మొదలైన విషయాలను వివరిస్తుంది.

పాలమూరు జిల్లా పరిశోధకులు కీ.శే.డా.కపిలవాయి లింగమూర్తి గారు తాము రచించిన "పాలమూరు జిల్లా దేవాలయాలు" అనే గ్రంధములో ఒక చోట తుమ్మల సూగూరు అనే గ్రామాన్ని "బేచిరాగు" గా పేర్కొన్నారు.  ఈ విషయాన్ని గమనించిన ఈ గ్రంథ రచయిత లింగారెడ్డి గారు అసలు బేచిరాగు అంటే ఏమిటి?  తమ గ్రామానికి ఆ పేరు  ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో 1881 లో నిజాం ప్రభుత్వపు రెవిన్యూ సెక్రెటరీ అయిన చిరాగ్ అలీ రాసిన Hyderabad deccan under sir salar jung" అనే పుస్తకాన్ని పరిశీలించారు.  ఆ పుస్తకం రెండవ భాగములో 200 వ పుటలో "-సాలార్ జంగ్ దివానుగా నియామకం కాక ముందు అంటే 1853 కు ముందు నిజాం రాజ్యములోని అరాచక పరిస్థితులు, పీడనా పూర్వక భూమి శిస్తు విధానాల వల్ల, చాలా గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా వ్యవసాయదారులు తమ గ్రామాలను ఖాళీ చేసి పారిపోయి తమకు అనువుగా సౌకర్యముగా, రక్షణగా ఉన్నచోట స్థిరపడ్డారు.  దాంతో చాల గ్రామాలు బేచిరాగుగా మారాయి" అని పేర్కొనడం జరిగింది.

ఇలాంటి అనేక చారిత్రక  అంశాలను వివిధ గ్రంథాలను పరిశీలించి, పరిశోధించి, నేటి యువతకు అందించాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రచించినట్లుగా తెలుస్తుంది.  ఇందులోని అంశాలు పదకొండు అధ్యాయాలలో వివరించబడ్డాయి.  ప్రముఖ చారిత్రక యాత్రా పరిశోధకులు శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు ఈ జిల్లా పరిసరాల్లో ప్రయాణించిన విషయాలను ఇందులో తేదీల వారిగా  రచయిత పొందుపరచడం విశేషం.

నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని పరిపాలించిన పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు మొదలైన వారి వివరాలతో పాటు వారి అనంతరం పరిపాలించిన నిజాం రాజుల గురించి, మజరం నుండి మౌజాగా ఎదిగిన వారి గ్రామం, అప్పుల ఊబిలో నైజాం రాజ్యం, బేచిరాగుగా మారిన తుమ్మల సూగూరు, తర్వాత పునరుజ్జీవనం పొందిన విధానం, వారి గ్రామంలో రైతాంగ పరిస్థితులు మొదలైన విషయాలను రచయిత లింగారెడ్డి వివిధ అధ్యాయాలలో, చిత్ర పటాలతో సహా వివరించిన విధానాన్ని గమనిస్తే వీరి బహు గ్రంథ పరిశీలన, శ్రమ మొదలైనవి పాఠకులను ఒకింత  ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

ఒక అంశాన్ని గురించి గొప్పగా రాస్తే తనకు తన సమాజం ద్వారా, తన వర్గం ద్వారాపేరు ప్రతిష్టలు వస్తాయనే కాంక్షతో రాసే కొంతమంది కవులు, రచయితలు ఉన్న నేటి కాలములో ఎలాంటి స్వార్థాన్ని ఆశించకుండా నేటి యువతకు, భావిభారత పౌరులైన విద్యార్థులకు తమ గ్రామ చరిత్రను శ్రమకోర్చి అందించిన శ్రీ కందూరు లింగారెడ్డి అభినందనీయులు.  నిజానికి ఈ గ్రంథం వారి గ్రామ చరిత్రనే అయినా తెలంగాణకు చెందిన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుంది.  తమ తమ గ్రామాల చరిత్రలను కూడా వెలికితీయడానికి ఈ గ్రంథం ఎందరికో స్ఫూర్తినిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

గ్రంథం వెల.100 రూ.
ప్రతులకు :
కందూరు లింగారెడ్డి
దశరథ రామ పబ్లికేషన్స్
తుమ్మల సూగూర్
నాగర్ కర్నూల్ (జిల్లా)
చరవాణి
9951990672.