అంతర్మధనంలో రగులుతున్న నిశ్శబ్ద సందేశం ఆకు పచ్చని పదాల పూతలై  కవితగా నిలబడేందుకు చేసిన "అంతర్మధనం" నిజామాబాద్ నుండి రాస్తున్న శ్రీమతి వసంతా లక్ష్మణ్ కవితలో చదవండి.

ఇన్నాళ్లు చెప్పుకోడానికి
నన్ను నేను విప్పుకోడానికి 
ఏమీ లేక 
నాలో నేనై మిగిలాను
ఒక నిర్వేదపు నిశ్శబ్దం 
నన్ను పగులగొడ్తుంటే
రాగాన్ని దాచుకున్న కోయిలలా 
మౌనమై ముడుచుకున్నాను
స్తబ్ధంగా ప్రవహిస్తున్న
నా ఏకాంత నదిలో 
కలలు లేవు 
అలల పలకరింపులు అసలే లేవు
శూన్య పక్షినై
శరీరంతో సహవాసం చేసిన 
అనారోగ్యపు సందోహాలను విదిలించుకొని
ఇప్పుడిపుడే తేటపడ్తు 
కాసిన్ని అనుభూతుల్ని 
కలం నిండా నింపుకొని
మిమ్మల్నిలా పలకరించే
సాహసం చేస్తున్నాను
అయినా కవిత్వంలో ఏముంటుంది 
నాలుగు పదాల కూర్పే కదా అనుకోవద్దు
ఒక్కసారి మనసు పెట్టి 
చదివి చూడు
నా కవిత్వంలోని అక్షరమక్షరం నడుమ 
నా మనసు పడే ఆర్ద్రత ఉంటుంది
ఇన్నాళ్లు నా అంతర్మధనంలో రగులుతున్న 
ఒక నిశ్శబ్ద సందేశం ఉంటుంది
పుస్తకంలోని చివరి పేజీలా
ఖాళీలా నిలబడ్డ నన్ను
మీ ఆత్మీయత పలకరించిందేమో
నెర్రెలు విచ్చిన మనసుపై
ఆకుపచ్చని పదాల పూలతలు 
మొలకెత్తి ఇవాళ్ళ మీ ఎదుట 
నన్నొక కవితగా నిలబెట్టాయి.