అనుభవాల ఇంద్రధనస్సు ‘తెరిచిన పుస్తకం’
అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం జీలానీ భానూ రాసిన " తెరిచిన పుస్తకం " అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే జీలానీ భానూ రాసిన ‘తెరిచిన పుస్తకం’ అందుకున్నాను. మెహక్ హైదరాబాదీ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ గొప్ప అనుభావాల ఇంద్రధనస్సుని నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టంట్ ఎడిటర్ డాక్టర్ పతిపాక మోహన్ ద్వారా అందుకున్నాను. మొదట ఆయనకు ధన్యవాదాలు. " చిన్ననాటి జ్ఞాపకాలు" శీర్షిక కింద ఎన్ బీ టీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
ఇవి కేవలం జీలానీ భానూ వ్యక్తిగత అనుభావాలే కాదు ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక తరం గడిపిన జీవితాల చిత్రణ. ఇప్పటికీ చాలా మందికి తెలీని చాలా గొప్ప హైదరాబాదీ దక్కన్ సంస్కృతిని ఈ చిన్న పుస్తకం ఆవిష్కరించింది.
నిజానికి ఒక ప్రతిభావంతుడయిన కవో రచయితో కళాకారుడో తన జీవిత చరిత్రని లేదా జ్ఞాపకాల్ని రాసినప్పుడు కేవలం స్వీయ అనుభవాలు లేదా సొంత బతుకు మాత్రమే రికార్డ్ కాదు. వాటితో పాటు ఆయా కాలాల సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులూ మన ముందుకు వస్తాయి. ఫలితంగా మనకు ఆయా దేశకాల పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తాయి. భవిష్యత్తు తరాలకు మార్గ నిర్దేశనం కూడా చేస్తాయి. అందుకే “ప్రతి గొప్ప ఆత్మకథా అప్రకటిత సామాజిక సాంస్కృతిక రాజకీయ చరిత్ర” నే. వర్తమానంలో వాస్తవిక చరిత్రను పక్కదోవ పట్టిస్తున్నారు. కాలం గడిచిన కొద్దీ తమకనుకూలంగా వక్ర భాష్యాలు చెబుతున్నారు. కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిజాయితీగా రాసిన జీవిత చరిత్రలు వాస్తవ అవగాహనకు కొంత ఆధారాలవుతాయి. ఇవ్వాళ రాయగలిగిన ప్రతి రచయితా, కవీ, కళాకారుడూ, మేధావీ తమ అనుభవాల్ని ఎదో రకంగా అక్షరబద్ధం చేయాల్సిన అవసరంవుంది. ఆపనిని జీలానీ భానూ రాసిన తెరిచిన పుస్తకం ప్రతిభావంతంగా చేసింది.
....
‘జ్ఞాపకాల మబ్బులు కమ్ముకుని చినుకు చినుకుగా వర్షిస్తున్నాయి. ఏనాడో గడిచిన కాలం. వెలుగులు విరజిమ్మే జ్ఞాపకాల కాంతులు. నవ్వులతో విరిసే అందమయిన ముఖాలు నాకు మాటలు నేర్పాయి. ముందుకు చాపిన ఆ చేతులు నన్ను మున్ముందుకు నడిపించాయి’ అంటూ జీలానీ భానూ తన జ్ఞాపకాల తిజోరీ తెరిచారు. మనముందు పరిచారు. ‘నా బాల్యం నన్నెప్పుడూ విడిచి పెట్టదు. చిన్నప్పుడు ఎంతో అమాయకంగా వుండేదాన్ని. ఎంత అమాయకత్వం అంటే- నా చుట్టూ కమ్ముకున్న చీకట్లూ వెలుగులూ కూడా నాకు తెలిసేవి కావు’ అన్న ఆమె తన జీవితంలో సాధించిన అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పారు. ఒక ప్రవాహంలా సాగిందీ రచన.
తమ ఇంట్లో అమలులో వున్న సనాతన సాంప్రదాయాలు మొదలు అనేక అంశాల్ని ఆమె స్పృశించారు. గొప్ప రచయిత అయిన జీలానీ భానూ “ ఖాళీ పేపర్ పై నేను ఏదయినా కథ రాయాలనుకున్నప్పుడు ” , నేను నేను కాదు- నేను మరో మనిషిని” అని నాకనిపిస్తుంది. నేనేమి రాశాను? ఎందుకు రాశాను? అని లోతుగా పరిశీలిస్తాను అన్నారు. నిజంగా ఎంత మంచి అభిప్రాయం. రాసేవాళ్ళంతా అనుసరించాల్సిన దారి.
చిన్నప్పుడే తమ ఇంట్లో జరిగే ముశాయిరాలకు వచ్చే అప్పటి ప్రముఖ కవుల రచనలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఫానీ బదాయునీ, జోష్ మలిహా బాదీ, జిగర్ మురాదా బాదీ, హాష్ బిలిగ్రామీ, ముఖ్డుం మొహియోద్దీన్, కైఫీ అజ్మీ, షకీల్ బదాయునీ, మజ్రూ సుల్తాన్ పూరి లాంటి ఎందరో గొప్ప కవులు వారి రచనల పరిచయం ఆమెను భిన్నంగా ఆలోచించడానికి ఉపయోగపడింది. చిన్నప్పటి నుండి రచనలు చేసిన ఆమె ‘లోకం’ పెళ్లి తర్వాత మరెంతో విస్త్రుత మయింది. భర్త అన్వర్ మో అజ్జం గొప్ప ఉర్దూ పండితుడూ, పరిశోదకుడూ. ఆ క్రమంలో ఆమె ఇస్మత్ చుగ్తాయి, కృష్ణ చందర్, అమ్రితా ప్రీతం, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అలీ సర్దార్ జాఫ్రీ తదితరులతో సాన్నిహిత్యం ఆమె సృజనకు ఎంతో దోహదపడింది. ఎన్నో గొప్ప అనుభవాల్ని మిగిల్చింది. ఆ అనుభవాల్ని ఈ చిన్న పుస్తకంలో నిక్షిప్తం చేసారు. ముఖ్యంగా తన చిన్న నాటి జ్ఞాపకాల్ని అందించిందీ పుస్తకం.
జీలానీ భానో 14 జూలై 1936 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బదాయున్ లో జన్మించారు. ఆమె తండ్రి హైరత్ బదాయుని ఉర్దూలో గొప్ప కవి, పండితుడు. ఆమె తన చిన్ననాడే కథలు రాయడం ఆరంభించింది. ఆమె రాసిన మొదటి కత ‘ఏక్ నజర్ ఇదర్ భీ’ 1952లో అచ్చు అయింది. ఇప్పటికి తను 22 పుస్తకాలు వెలువరించారు. అందులో ‘రోష్ని కే మినార్’ లాంటి కథల పుస్తకాలూ, ‘అయివాన్ ఎ గజల్’ లాంటి నవలలు ఉన్నాయి. ఇంకా ఆమె తన జీవిత చరిత్ర “అఫ్సానే’, ఇతర ప్రసిద్ధ రచయితలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల సంపుటిని వెలువరించారు. జీలానీ భానో రాసిన ‘నర్సయ్యా కీ బావ్డీ’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ ‘ వెల్ డన్ అబ్బా ' సినిమాగా రూపొందించారు. ఆమెకు పద్మశ్రీ అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రు పురస్కారం, హర్యానా ఉర్దూ అకాడెమీ నుండి ఖ్వామీ హాలీ అవార్డ్, తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే ముక్దుం అవార్డ్, హైదరాబాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ తో పాటు అనేక పురస్కారాలు పొందారు. అస్మిత లాంటి సంస్థలకు సేవలందించారు.
యువతలో చదువే ఆసక్తిని పెంపొందించే కృషిలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం యువకులే కాదు పెద్దలూ చదవాలి.
ఇక అనువాదం విషయానికి వస్తే చాలా సరళంగా సాగింది. మెహక్ హైదరాబాదీగా ప్రసిద్దులయిన పి.వి.సూర్యనారాయణ మూర్తి సీనియర్ జర్నలిస్టు, ఉర్దూ కవి, అనువాదకులు. ఆయనకు నా అభినందనలు.