వారాల ఆనంద్ తెలుగు కవిత: సంధ్యాకాలం

మనలోని జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తెరిచి చూసుకుంటే  సంధ్య వేళలు ఎప్పటికీ ముగింపు కావనే వాస్తవాన్ని వారాల ఆనంద్  రాసిన 'సంధ్యాకాలం' కవిత తెలియజేస్తుంది.
 

Varala Anand Telugu poem, telugu literature

సాయంకాలమయింది 

అవును 
వెలుగునీ వయసునీ 
ఎవరుమాత్రం పిడికిట్లో 
బంధించి ఉంచగలరు 

కిరణాలు వాలిపోతాయి 
మసక మసకగా 
చీకటి కమ్ముకొస్తుంది 

వయసు వెనక్కి నడుస్తుంది 
కళ్ళ కింద నలుపు చారలు మెరుస్తాయి 
ముఖం మీది ముడుతలు ముచ్చటేస్తాయి  

సహచరులు కొందరు 
తొందరపడి సెలవు తీసుకుంటారు 

చీకటి వెలుగుల సంధి కాలమిది 
అనుభవాల తోరణం ధరించిన 
అందమయిన వయసిది 

పగలు ముగిసి రాత్రి 
ఆవహిస్తున్నట్టనిపిస్తుంది 
కానీ 
ఒక్కసారి బయట కెళ్ళి 
ఆకాశంకేసి చూడు 
చీకటి వేళ విచ్చుకుంటున్న 
తొలి నక్షత్రం సౌందర్యాన్ని చూడు 

ఒక్కసారి నీ లోకి చూడు 
జ్ఞానమూ అజ్ఞానమూ 
దుఖమూ సంతోషమూ 
పెనవేసుకున్న పరిమళాన్ని చూడు 

సాయంకాలమయితే ఏమిటి 

నక్షత్రాల వెలుగునీ నా అనుభవాన్నీ 
స్వీకరించి ఆనందించే 
కోట్లాది కళ్ళున్నాయి 
వాటిలో వెలుగులు నిండుతాయి 
కలలు విచ్చుకుంటాయి  
 
సంధ్య ఎప్పటికీ ముగింపు కాదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios