వారాల ఆనంద్ కవిత : చీకటీ వెల్తురూ .. సమాంతరమే
చూస్తుండగానే ప్రతి ఇటుకా నాకో బతుకు పాఠమయి నిలుస్తుంది అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత " చీకటీ వెల్తురూ .. సమాంతరమే " ఇక్కడ చదవండి:
వెన్నెల కరువైన ఓ చీకటి రాత్రీ
సకులం ముకులం వేసుకు కూర్చోకు
ఒళ్ళు విరిచుకుంటూ బద్దకించకు
కొంచెం తొందరగా నడువు
వెలుగును మోసుకొచ్చే ఉదయాన్ని
ఏ కొంచెమయినా ఆలస్యం కానీయకు
నేనేమో రోజూ పొద్దున్నే దోసిలి పట్టి
తూర్పునకు అభిముఖంగా నిలబడతాను
ప్రాతః కాలపు సువాసనని ఆఘ్రానిస్తాను
ముక్కుపుటాలను ఎగరేస్తాను
పొద్దు గడిచిన కొద్దీ క్షణాలూ గంటలూ
నన్ను దాటేసుకుంటూ వెళ్ళిపోతాయి
ఎన్నెన్నో అనుభవాల్ని ఇటుకల్లా నాచుట్టూ
పేర్చుకుంటూ పోతాయి
చూస్తుండగానే ప్రతి ఇటుకా నాకో
బతుకు పాఠమయి నిలుస్తుంది
దానికి సమాంతరంగా లోనెక్కడో
జ్ఞాపకాలు మిణుకు మిణుకు మంటూ
తారల్లా మెరుస్తుంటాయి
తెల్లారగట్ల మొదలయిన రోజు
బద్దకంగానో హుషారుగానో నడుస్తుంది
ఒక్కోసారి పరుగులు పెడుతుంది
చూస్తుండగానే రోజు ముగుస్తుంది
సాయంత్రం ముంచుకొస్తుంది
జ్ఞాపకాల్ని నంజుకుంటూ
కొత్త అనుభవాల రుచి చూస్తూ
నేను మళ్ళీ రాత్రి చీకట్లోకి జారుకుంటాను
త్వరగా నడవమని
చీకటి రాత్రిని మళ్ళీ వేడుకుంటాను
చీకటీ వెల్తురూ
కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం
రెండూ సమాంతరమే కాదు
అనివార్యం కూడా